TSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఒక్కరోజే 52.78 లక్షల మంది ప్రయాణం: సజ్జనార్‌

ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో స్వగ్రామాలకు తరలివెళ్లినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

Published : 14 Jan 2024 22:03 IST

హైదరాబాద్‌: సంక్రాంతికి ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లడంతో భాగ్యనగరం ఖాళీ అయింది. శనివారం ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో స్వగ్రామాలకు తరలివెళ్లినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రయాణికుల్లో అత్యధికులు మహిళలేనని పేర్కొన్నారు. వారంతా మహలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ప్రయాణించినట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో శనివారం రోజున ఆర్టీసీ సంస్థ 1,861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపినట్లు వెల్లడించారు. వాటిలో 1,127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పినట్లు వివరించారు. తొలిసారిగా బస్‌ భవన్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. సిబ్బంది, అధికారులు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం పట్ల సజ్జనార్‌ సంతోషం వ్యక్తం చేయడంతోపాటు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని