IRCTC: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోటల్‌ ఇన్‌ కేరళ’ ప్యాకేజీ!

కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇంట్లో కాకుండా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, వెళ్లే చోట వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేలా వసతులు

Published : 24 Jul 2021 14:56 IST

తిరువనంతపురం: కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇంట్లో కాకుండా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, వెళ్లే చోట వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేలా వసతులు ఉంటాయో, లేదో అని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌(ఐఆర్‌సీటీసీ) ప్రత్యేకంగా ఓ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

దైవభూమి.. పచ్చని ప్రకృతికి నెలవైన కేరళలోని పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి పని చేసుకునేలా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోటల్‌’ పేరుతో ఈ ప్యాకేజీని మే నెలలోనే ప్రారంభించింది. కరోనా, లాక్‌డౌన్‌తో నష్టపోయిన పర్యాటక రంగానికి, కేరళ రాష్ట్రానికి, అలాగే కరోనా పరిస్థితుల్లో అనేక ఒత్తిళ్లకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ ప్యాకేజీ ధర రూ.10,126 నుంచి (ట్రిపుల్‌ ఆక్యూపెన్సీ) ప్రారంభమవుతుంది. ఐదు రాత్రులు సాగే ఈ ప్యాకేజీలో భాగంగా హోటల్‌లో పూర్తిగా శానిటైజ్‌ చేసిన గది, మూడు పూటల భోజనం, రోజులో రెండు సార్లు కాఫీ/టీ అందిస్తారు. వర్క్‌ ఫ్రమ్‌ హోటల్‌ కాబట్టి.. ఉచితంగా వైఫై, వాహనాలు నిలుపుకొనేందుకు పార్కింగ్‌ స్థలం, ట్రావెల్ ఇన్సూరెన్స్ లభిస్తాయి. 

మున్నార్‌, కుమరకొమ్‌, మరారి(అలప్పీ), కోవలమ్‌, వయనాడ్‌, కొచ్చి తదితర ప్రాంతాల్లో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోటల్‌’ ప్యాకేజీ అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లోని హోటల్‌ గదుల్లో బస చేస్తూ పనితోపాటు.. కొత్త ప్రాంతపు అందాలను ఆస్వాదించొచ్చు. అయితే, కొవిడ్‌ దృష్ట్యా సందర్శక ప్రాంతాలను ప్యాకేజీలో భాగం చేయకపోవడం గమనార్హం. ఐదు రాత్రులు ప్యాకేజీలో కనిష్ఠ పరిమితి మరికొన్ని రోజులు అయినా అదనపు చెల్లింపులతో పొడిగించుకునే అవకాశం కల్పిస్తోంది. ప్యాకేజీలో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు