Pawan Kalyan: పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు: పవన్‌ కల్యాణ్‌

కేంద్రం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మపురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. 

Published : 26 Jan 2023 01:34 IST

హైదరాబాద్‌: పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద విజ్ఞానాన్ని ఉపదేశించే చినజీయర్ స్వామి, రామచంద్ర మిషన్ ద్వారా సేవలు అందిస్తున్న అధ్యాత్మిక గురువు కమలేశ్ డి.పటేల్‌ను పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషదాయకమన్నారు. సమతామూర్తి విగ్రహ స్థాపన ద్వారా చినజీయర్ స్వామి నవతరానికి చక్కటి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ‘జిమ్స్’ సంస్థ ద్వారా విద్య, వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో తెలుగు సినిమా పాటను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సంఘ సేవకులు డా.సంకురాత్రి చంద్రశేఖర్, తెలంగాణకు చెందిన భాషా శాస్త్రవేత్త బి.రామకృష్ణా రెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కడం ఆనందకరమన్నారు. బి.రామకృష్ణా రెడ్డి ముఖ్యంగా గిరిజన భాషలపై చేసిన పరిశోధనలు, నిఘంటువుల రూపకల్పన అమూల్యమైనవన్నారు. రామకృష్ణారెడ్డికి వచ్చిన పురస్కారం భాషకు ఇచ్చిన పురస్కారమేనని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన సి.వి.రాజు, అబ్బారెడ్డి నాగేశ్వర రావు, ఎం.విజయ గుప్తా, డా.పసుపులేటి హనుమంత రావు, కోట సచ్చిదానంద మూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని