
Japan Show: ఎత్తయిన రోడ్డుపై పరుగెడతారు.. అదో పాపులర్ షో!
(Photos: Zenryokuzaka youtube screenshots)
ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక టీవీ కార్యక్రమం చేయడం కొంచెం కష్టం.. దాన్ని ఏళ్లతరబడి కొనసాగించడం మరింత కష్టం. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచులను తెలుసుకుంటూ కొత్తదనం, సృజనాత్మకత చూపిస్తే తప్ప ఈ కాలంలో ఏ కార్యక్రమం విజయవంతంగా కొనసాగే అవకాశాలు లేవు. కానీ, జపాన్‌లో ఓ టీవీ కార్యక్రమం ఉంది. అందులో ఎపిసోడ్‌కు ఒక్కరు చొప్పున అమ్మాయిలు ఎత్తయిన రోడ్డుపై పరుగెడుతుంటారంతే. కేవలం అమ్మాయి పరుగును చూపించే ఈ కార్యక్రమాన్ని జపాన్‌వాసులు ఎంతలా ఆదరిస్తున్నారంటే.. గత 15 ఏళ్లుగా నిర్విరామంగా, దిగ్విజయంగా కొనసాగుతోంది.
జపాన్‌లోని టీవీ అసహి అనే ఛానెల్‌లో సోమవారం నుంచి గురువారం వరకు అర్ధరాత్రి 1.20 నిమిషాలకు జెన్రియోకుజకా పేరుతో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంటుంది. ఆరు నిమిషాలలోపు నిడివి ఉండే ఈ కార్యక్రమంలో ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో అమ్మాయి రోడ్డుపై పరుగులు పెడుతుంటుంది. ఎత్తయిన రోడ్డును ఎంచుకొని.. వొంపు మొదలు నుంచి పరుగు ప్రారంభిస్తుంది. అలా కొన్ని నిమిషాలపాటు ఎత్తువైపు పరిగెత్తి.. పరిగెత్తి ఆయాసం వచ్చిన చోట ఆగిపోతుంది. ఈ కార్యక్రమాన్ని జపనీయులు అర్ధరాత్రి వేళ నిద్రను ఆపుకొని మరి చూస్తుండటం విడ్డూరం.
ఇందులో యువ నటీమణులు, ఇతర రంగాల్లో మహిళా ప్రముఖులు తరచూ పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమం బాగా పాపులరైంది. టోక్యో.. పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తుంటారు. ఈ ఛానెల్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌లో దాదాపు 3వేల ఎపిసోడ్లు 45 సెకన్ల నిడివితో అందుబాటులో ఉన్నాయి. 15ఏళ్లుగా కేవలం అమ్మాయిల పరుగును మాత్రమే చిత్రీకరిస్తూ వస్తున్న కార్యక్రమం నిర్వహణ బృందం ఇటీవల తొలిసారి ఒక పురుషుడికి అవకాశం కల్పించింది. పలు టీవీ, వెబ్‌సిరీసుల్లో నటించే రియోసుకె మియురా అనే నటుడి పరుగును ప్రసారం చేసింది. భలే విచిత్రంగా ఉంది కదా కార్యక్రమం!