Viveka Murder Case: అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.

Updated : 15 Apr 2024 21:47 IST

హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. అవినాష్‌ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

దస్తగిరిని, అతని కుటుంబాన్ని అవినాష్‌ రెడ్డి బెదిరిస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేసిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేసేలా పలు చర్యలకు పాల్పడ్డారని వివరించింది. ‘‘అవినాష్‌ రెడ్డి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి. కేసును ప్రభావితం చేస్తున్నారు. బెయిల్‌పై బయట ఉండే అర్హత ఆయనకు లేదు. అందుకే, వెంటనే బెయిల్‌ రద్దు చేయాలి’’అని సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 

మరోవైపు న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌.. దస్తగిరి తరఫున కోర్టులో వాదించారు. ‘‘2023 మేలో అవినాష్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 11 నెలల తర్వాత బెయిల్‌ రద్దు చేయమని మేం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం. ఒకవేళ రాజకీయ ప్రొద్బలం ఉంటే వెంటనే హైకోర్టును సంప్రదించే వాళ్లం. దస్తగిరి, ఆయన భార్య, తండ్రిపై దాడికి దిగారు. మెడికల్‌ క్యాంపు పేరుతో చైతన్యరెడ్డి జైలుకి వెళ్లి దస్తగిరికి రూ.20 కోట్లు ఇస్తామని మభ్యపెట్టారు. జైలు అధికారులు, పోలీసులతో కుమ్మక్కై సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు’’అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని