SImhachalam: అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం

చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం శోభాయమానంగా జరిగింది.

Updated : 19 Apr 2024 23:58 IST

సింహగిరిపై వైభవోపేతంగా రథోత్సవం
అశేషంగా తరలివచ్చిన భక్తజనం  

సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం శోభాయమానంగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఐ.వి.రమణాచార్యులు, అలంకారి పురోహితులు కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చక పరివారం వైదిక కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపించారు. మధ్యాహ్నం ఆలయంలో కొట్నాల ఉత్సవం జరిగింది. ముత్తైదువలు రోటిలో పసుపు కొమ్ములు దంచి పసుపు చూర్ణం తయారు చేశారు. అనంతరం సింహగిరి మాడవీధుల్లో అర్చకులు గ్రామ బలిహరణం జరిపించారు. ముక్కోటి దేవతలను స్వామి కల్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. తర్వాత అమ్మవార్లను ముత్యాల పల్లకీలో, స్వామిని బంగారు తొళక్కియాన్‌లో అధిష్ఠింపజేసి మాడవీధుల్లో చెరోవైపున తిరువీధి నిర్వహించారు. పశ్చిమ మాడవీధిలోని జోడుభద్రాల వద్ద స్వామి, అమ్మవార్లను ఎదురెదురుగా ఆశీనులను చేసి ఎదురు సన్నాహ ఉత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల తరఫున పండితులు సంవాద సేవ నిర్వహించి స్వామి వారి గొప్పతనాన్ని అమ్మవార్లకు తెలియజేసి పరిణయానికి ఒప్పించే ఘట్టాన్ని రమణీయంగా నిర్వహించారు.

అంగరంగ వైభవంగా రథోత్సవం: ఎదురు సన్నాహోత్సవం అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి రాజగోపురం ఎదురుగా రథంలో కొలువుదీర్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. అమ్మవారి తరఫున జాలరి కుల పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథ్యం వహించారు. రథంలో కొలువైన గోవిందరాజ స్వామి, అమ్మవార్ల శోభాయాత్రను దర్శించుకున్న అశేష భక్తజనం గోవింద నామస్మరణ చేశారు.

కనులపండువగా పరిణయ వేడుక: రథోత్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని బంగారు తొళక్కియాన్‌లో అధిష్ఠింపజేసి ఊరేగింపుగా నృసింహ మండపం ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్ఠింప జేశారు. అర్చకులు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు. వేదమంత్రాల నడుమ దేవతామూర్తుల శిరస్సున జీలకర్ర, బెల్లం ఉంచి సుముహూర్తాన నాదస్వర మంగళవాయిద్యాలతో మాంగల్యధారణ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించారు. మంచి ముత్యాలను స్వామి, అమ్మవార్ల శిరస్సున వేసి తలంబ్రాల తంతు వేడుకగా జరిపించారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకను తిలకించారు. అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సింహగిరిపై విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. మహిళల కోలాటం, జానపద కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. విశాఖ శ్రీశారదా పీఠం స్వామీజీలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర, సీపీ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని