చదివింది నాలుగు..4 భాషల్లో నిఘంటువు

నిఘంటువులో ఓ పదానికి అర్థం వెతుక్కోవడానికే తడబడుతుంటాం. అలాంటిది కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్న వ్యక్తి నాలుగు భాషల్లో నిఘంటువు రూపొందించాడంటే మామూలు విషయం కాదు. ఆ ఘనత వెనక ఆయన అవిరళ కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. ఓవైపు పొట్టకూటి...

Published : 05 Jan 2021 02:08 IST

83 ఏళ్ల వయస్సులో కేరళవాసి ఘనత

ఇంటర్నెట్‌డెస్క్‌: నిఘంటువులో ఓ పదానికి అర్థం వెతుక్కోవడానికే తడబడుతుంటాం. అలాంటిది కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్న వ్యక్తి నాలుగు భాషల్లో నిఘంటువు రూపొందించాడంటే మామూలు విషయం కాదు. ఆ ఘనత వెనక ఆయన అవిరళ కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. ఓవైపు పొట్టకూటి కోసం ఏదో చిన్న ఉద్యోగం చేస్తూనే కేరళతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో తిరిగి మరీ దాదాపు 12.5 లక్షల పదాలకు అర్థాల్ని నిఘంటువులో నిక్షిప్తం చేశారు కేరళకు చెందిన శ్రీధరన్‌. మలయాళంలో 1872లో తొలి నిఘంటువు విడుదలైంది. ఆ తర్వాత తాజాగా విడుదలైన నిఘంటువే రెండోది.

నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్తి

కేరళలోని తలస్సెరీ గ్రామానికి చెందిన 83 ఏళ్ల శ్రీధరన్‌ కనీసం ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయలేదు. నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి స్థానిక ఓ బీడీ కర్మాగారంలో పనికి కుదిరారు. అయితే పదాలు, వాటికి వివిధ భాషల్లో అర్థాలను తెలుసుకోవాలనే తాపత్రయమే ఆయన్ను నిఘంటువును తయారు చేసే స్థాయికి చేర్చింది. బీడీ కార్మాగారంలో పని చేస్తున్న సమయంలోనే  ఇంగ్లీష్‌ స్టాండర్డ్‌ పబ్లిక్‌ పరీక్ష (ఈఎస్‌ఎల్‌సీ)ను ప్రైవేటుగా పూర్తి చేశారు. ఆ తర్వాత పబ్లిక్‌ వర్స్క్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే 1984లో నిఘంటువు రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలతోపాటు పదాలకు వివిధ భాషల్లో అర్థాలు వెతకడం, వాటిని ఓ క్రమపద్ధతిలో చేర్చడం కాస్త కష్టంగా అనిపించేదట. అయినప్పటికీ పట్టు వదలకుండా వివిధ పదాలకు అర్థాలను వెతికే వారు. అలా 1994 వరకు సాగింది. అదే ఏడాది ఉద్యోగవిరమణ చేయడంతో శ్రీధరన్‌ తన పూర్తి సమయాన్ని నిఘంటువు రూపకల్పనకే కేటాయించారు. గంటల తరబడి తన గదిలో కూర్చొని రకరకాల పదాలు, వాటికి తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ అర్థాలను వెతకడం తనకు ఎంతో ఆసక్తి కలిగించేదని శ్రీధరన్‌ చెబుతున్నారు.

ఇదీ దినచర్య

తొలుత ఇంట్లో ఉన్న వస్తువుల పేర్లన్నీ మలయాళంలో రాసుకోవడం. వాటిని తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఏమంటారో తెలుసుకోవటం ... ఇలా తన దినచర్య సాగేది. నిత్యజీవితంలో ఎన్నెన్ని మాటలు ఉపయోగిస్తామో అన్నింటినీ విభాగాల వారీగా రాసుకునేవారు. ఆయా భాషల వాళ్లతో మాట్లాడుతూ..కొత్త పదాలకు అర్థాలను తెలుసుకునేవారు. దీనికోసం కేరళతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో చాలాసార్లు పర్యటించారట. అంతేకాకుండా ఈ నాలుగు భాషల్లోని వార్తాపత్రికలూ చదివేవారు. ఇలా పాతికేళ్లు గడిచాక చూస్తే ... పెద్ద నిఘంటువు తయారై పోయింది! ఈ కృషి ఇలా ప్రణాళికాబద్ధంగా సాగటానికి డాక్టర్‌ సుకుమారన్‌ అనే ఓ ప్రొఫెసరు సలహా కూడా కారణమని శ్రీధరన్‌ చెప్పుకొస్తారు.

వివిధ రాష్ట్రాల ప్రజలతో కలిసి మాట్లాడటం, స్థానిక భాషల గురించి తెలుసుకోవడం వల్లే నిఘంటువు రూపకల్ప సాధ్యమైందని శ్రీధరన్‌ చెబుతున్నారు. తన ఉత్సుకతను తెలుసుకున్న ఆయా రాష్ట్రాల ప్రజలు మరింతగా సాయం చేసేవారని అన్నారు. కొన్ని పదాలకు అర్థాలు సులభంగానే దొరికిపోయేవని, మరికొన్నింటికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చేదని అంటున్నారు. నిఘంటువులో ఏ పదానికి అర్థం కనుగొనేందుకు ఎక్కువ సయమం పట్టింది కొందరు ప్రశ్నిస్తే.. ‘వయంబు’ అని చెప్పుకొస్తారు. అంటే మళయాళంలో ఆయుర్వేద మొక్క అని అర్థమట.

అక్కడా కష్టాలే!
ఇంత కష్టపడి నిఘంటువును తయారు చేసినా దాని ప్రచురణకు తొలుత ఎవరూ ముందుకు రాలేదు. ఏదైనా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకులో, విద్యార్థులో తమ పరిశోధనలతో కొత్త వాటిని రూపొందిస్తే పబ్లిషర్లు ముందుకొస్తారు. ప్రభుత్వం కూడా వారికి ఆర్థిక సాయమందిస్తుంది. కానీ, శ్రీధరన్‌ పరిస్థితి అలా కాదు. అందువల్ల ఎంతోమంది ప్రైవేటు పబ్లిషర్ల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ నందన్‌ ఆయన పరిస్థితులను గుర్తించి ఓ వీడియో డాక్యుమెంటరీ రూపొందించాడు. అందులో పబ్లిషర్ల కోసం శ్రీధరన్‌ పడుతున్న అవస్థలను వివరించాడు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తర్వాత చివరకు 2020 నవంబరులో ఆ నిఘంటువు బయటకొచ్చింది. కేరళ సీనియర్‌ సిటిజన్‌ ఫోరం వాళ్లు ప్రచురణ బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం 900 పేజీలున్న ఈ నిఘంటువు ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైంది. ధర రూ.1,500గా నిర్ణయించారు. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే 9895410120 నెంబరుకు ఫోన్‌చేసి కూడా ఆర్డర్‌ చేసుకోవచ్చు.

ఇవీ చదవండి

పోస్ట్‌ పెట్టేస్తారు.. కోట్లు పట్టేస్తారు!!

పచ్చబొట్టు పది కాలాలపాటు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని