Updated : 08 Oct 2020 17:07 IST

‘కరోనా వైరస్‌తో ప్రేమలో పడ్డ శాస్త్రవేత్త’

వైరల్‌ అవుతోన్న ‘కిస్సింగ్‌ ది కరోనా వైరస్‌’ నవల


(ఫొటో: అమెజాన్‌.ఇన్‌)

ఇంటర్నెట్‌ డెస్క్: గత కొన్ని నెలలుగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల అన్ని రంగాలు చతికిలపడ్డాయి. ఇప్పటికీ సినిమా రంగం కోలుకోలేకపోతుంది. అయితే, కొంతమంది మాత్రం కరోనావైరస్‌ను సైతం కంటెంట్‌గా మార్చి సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రామ్‌గోపాల్‌ వర్మ ‘కరోనా వైరస్‌’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. మరికొందరు తీయబోతున్నట్లు ప్రకటించారు. సినిమాలే కాదు.. కరోనాపై నవలలు కూడా వచ్చాయి. కొన్ని నెలల కిందట కరోనా వైరస్‌పై ఓ నవల మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు ప్రజలు పట్టించుకోలేదు గానీ, తాజాగా ఆ నవల సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘కిస్సింగ్‌ ది కరోనా వైరస్‌’ అనే నవలను ఎం.జె ఎడ్వర్డ్స్‌ అనే మహిళ రాశారు. ఇదే ఆమె తొలి నవల. 16 పేజీలుండే ఈ నవలలో డాక్టర్‌ అలెక్సా అషింగ్టన్‌ఫొర్డ్‌ అనే వైద్యశాస్త్రవేత్త కరోనా వైరస్‌కు టీకాను‌ కనిపెట్టే పనిలో నిమగ్నమవుతుంది. తయారు చేసిన వ్యాక్సిన్‌ను ట్రయల్స్‌లో భాగంగా తన తోటి శాస్త్రవేత్తపై ప్రయోగిస్తుంది. అయితే, ఆ టీకా‌ వికటించి ఆ శాస్త్రవేత్త మరణిస్తాడు. అతడి శరీరాన్ని కరోనా వైరస్‌ ఆక్రమించి మానవుడిలా మారిపోతుంది. ఆ తర్వాత మానవ రూపంలో ఉన్న ఆ వైరస్‌తో డాక్టర్‌ అలెక్సా ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని నవల చదివి తెలుసుకోవాల్సిందే. ఈ పుసక్తంపై డాక్టర్‌ అలెక్సా.. కరోనావైరస్‌ సన్నిహితంగా ఉన్న చిత్రం ఉంటుంది. రచయిత ఎం.జె ఎడ్వర్డ్స్‌ కరోనా కారణంగా తన ఉద్యోగం పోవడంతో అప్పులు చెల్లించడం కోసం ఈ ‘కిస్సింగ్‌ ది కరోనా వైరస్‌’ నవల రాశారట. ఫిక్షనల్‌-రొమాంటిక్‌ జోనర్‌లో రాసిన ఈ నవల ఏప్రిల్‌లోనే అమెజాన్‌కు చెందిన కిండిల్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.76. అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తాజాగా ఆ నవల సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లలో కొందరు ఈ నవల చాలా ఫన్నీగా ఉందని, బాగుందని అంటుంటే.. మరికొందరు వైద్యశాస్త్రాన్ని ఎగతాళి చేస్తూ రాస్తారా, చదివితే టైం వేస్ట్‌ అని మండిపడుతున్నారు. అమెజాన్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ నవలకు రేటింగ్‌ 4స్టార్స్‌(5స్టార్స్‌లో)రావడం విశేషం.

ఇదే తరహాలో కరోనాపై మరో నవల కూడా మార్కెట్లోకి వచ్చింది. నవల పేరు ‘కోర్టింగ్‌ ది కరోనా వైరస్‌’. జాన్‌ అనే మహిళ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టే ల్యాబ్‌లో పనిచేస్తుంటుంది. అనుకోకుండా ఆ వైరస్‌ను 19వ శతాబ్దంలోకి పంపిస్తుంది. దీనికి ఆ మహిళే బాధ్యత వహించి గతంలోకి వెళ్లి కరోనా వైరస్‌ను వెనక్కి తీసుకొస్తుంది. ఎలా అనేది తెలుసుకోవాలంటే నవల చదవాలి. ఇదీ కూడా అమెజాన్‌లోనే లభిస్తుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని