KTR: ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరిస్తాం : కేటీఆర్‌

ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో పటిష్ఠ ప్రణాళికతోనే అది సాధ్యపడిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులు తీస్తోందన్నారు.

Updated : 25 Mar 2023 14:21 IST

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ రద్దీ పెరిగిన దృష్ట్యా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోరైల్‌ను పొడిగించాలని స్థానికులు కోరుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. రానున్న ఎన్నికల్లో  వచ్చేది తెరాస ప్రభుత్వమేనని, అప్పుడు ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడతలో నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులు తీస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా నడుచుకొని తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నారు. అనంతరం ఆధునిక సౌకర్యాలతో ఫతుల్లాగూడలో నిర్మించిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ల ఆదర్శ వైకుంఠధామాలను ఆయన ప్రారంభించారు.

ఆ తర్వాత ఎల్బీనగర్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో పెంపుడు జంతువుల కోసం నిర్మించిన శ్మశాన వాటికను, బండ్లగూడ చెరువు నుంచి, నాగోల్‌ చెరువు వరకు ఎస్ఎన్‌డీపీ నాలా బాక్సుడ్రైన్‌ను, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ నుంచి పీర్జాదీగూడా వరకు లింక్‌ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్న కేటీఆర్.. పటిష్ఠమైన ప్రణాళికతో సాధ్యపడిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని