KTR: పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలి: పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం

ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారాస పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం, ఇవ్వాల్సిన వాటిని పెండింగ్‌లో పెడుతున్న తీరును కూడా ప్రజలకు వివరించాలన్నారు.

Updated : 20 Mar 2023 17:32 IST

హైదరాబాద్‌: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను భారాస ప్రతినిధులు పరామర్శించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచించారు. పార్టీ నేతలు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని.. రైతులకు భరోసా ఇచ్చేలా వారితో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. భారాస ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆదేశించారు. పంచాయతీరాజ్‌ రోడ్ల బలోపేతంపై దృష్టి సారించాలని.. వర్షకాలంలోపు పనులయ్యేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ఉపాధి హామీతో పాటు పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఏప్రిల్‌ 29వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఇస్తున్న సందేశాన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలని చెప్పారు. పార్టీ శ్రేణుల ప్రాధాన్యత, రాష్ట్ర ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన ముఖచిత్రం వంటి అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతి కార్యకర్తకూ అర్థమయ్యేలా వివరించాలని కేటీఆర్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కూడా విస్తృతంగా మాట్లాడుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు వంటి వాటిని కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి, ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలన్నారు.

కేంద్రం తీరునూ వివరించాలి..

ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం, ఇవ్వాల్సిన వాటిని పెండింగ్‌లో పెట్టడం.. తద్వారా తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్న తీరును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరేలా చూడాలన్నారు. ఇంకా ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రారంభం కాకుంటే వెంటనే ప్రారంభించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే.. ఏప్రిల్ 25న నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. వెయ్యి నుంచి 1500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ జరుగుతుందన్న కేటీఆర్.. దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని