ఈ 243 కి.మీ రహదారి.. ఒక యుద్ధ స్మారకం!

యుద్ధస్మారకమంటే ఓ భారీ శిలాకృతి లేదా.. భవంతి వంటివి ఉంటాయి. కానీ, ఆస్ట్రేలియాలో 243కి.మీ రహదారే యుద్ధ స్మారకం. దీన్ని చూసేందుకు కాదు.. కాదు దీనిపై ప్రయాణించేందుకు పర్యటకులు ఆసక్తి కనబరుస్తుంటారు. రోడ్డు యుద్ధస్మారకమవడం ఏంటని

Updated : 03 Mar 2021 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుద్ధస్మారకమంటే ఓ భారీ శిలాకృతి లేదా.. భవంతి వంటివి ఉంటాయి. కానీ, ఆస్ట్రేలియాలో 243కి.మీ రహదారే యుద్ధ స్మారకం. దీన్ని చూసేందుకు కాదు.. కాదు దీనిపై ప్రయాణించేందుకు పర్యటకులు ఆసక్తి కనబరుస్తుంటారు. రోడ్డు యుద్ధస్మారకమవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, దాని సంగతేంటో తెలుసుకుందాం పదండి..

1914-18 మధ్య మొదటి ప్రపంచయుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో అనేక దేశాలు పాల్గొన్నట్లే ఆస్ట్రేలియా కూడా పాల్గొంది. ఈ క్రమంలో వేల మంది ఆస్ట్రేలియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది క్షతగాత్రులయ్యారు. మరికొందరు క్షేమంగానే యుద్ధభూమి నుంచి తిరిగొచ్చారు. అయితే, మాజీలుగా మారిన సైనికులు ఇంటి వద్ద మరో పని దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన ఆ దేశ రహదారి సంస్థ ఛైర్మన్‌ విలియమ్‌ కాల్డర్‌ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన నివేదించాడు. యుద్ధంలో మరణించిన వారి స్మారకంగా విక్టోరియా రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతం గుండా టోకీ.. అలెన్‌ఫోర్డ్‌ నగరాలను కలుపుతూ ఒక రహదారి ఏర్పాటు చేయాలని సూచించాడు. 243కి.మీ పొడవు ఉండే ఈ రహదారిని మాజీ సైనికులతోనే నిర్మించేలా చేస్తే.. ఒకవైపు వారు ఉపాధి పొందినట్లు ఉంటుంది.. మరోవైపు మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన సైనికులకు స్మారకంగా ఉంటుందని పేర్కొన్నాడు. విలియమ్‌ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

నెలకు 3కి.మీ చొప్పున

ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో 1918లో సౌత్‌ ఈస్ట్‌ రోడ్‌ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించారు. దీని నిర్మాణం కోసం ‘గ్రేట్‌ ఓషియన్‌ రోడ్‌’ ట్రస్టు ఏర్పాటైంది. పలువురు దాతలు, రుణాల ద్వారా డబ్బును సమకూర్చుకుంది. ఆ తర్వాత మాజీ సైనికులతో 1919 సెప్టెంబర్‌ 19న రోడ్డు నిర్మాణం మొదలైంది. 3వేల మంది మాజీ సైనికులు.. ఈ రోడ్డు నిర్మాణం కూడా సైన్యం చేపట్టిన మిషన్‌లాగే భావించి పాలుపంచుకున్నారు. అప్పట్లో ఆధునిక పనిముట్లు ఏమీ లేవు. కొండలను సైతం చేతులతో పగలగొట్టాల్సిన పరిస్థితి. అందుకే రోడ్డు నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగింది. నెలకు 3 కి.మీ చొప్పున రోడ్డు వేశారు. పని పూర్తి చేసుకొని స్థానికంగా ఏర్పాటు చేసుకున్న గుడారాల్లో సైనికులు సేదా తీరేవారు. 1922 నాటికి మొదటిదశ రహదారి నిర్మాణం పూర్తి కాగా.. మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి మరో పదేళ్లు పట్టింది. అంటే మొత్తంగా.. టోకీ నుంచి అలెన్‌ఫోర్డ్‌ వరకు 243కి.మీ పొడవున్న ఈ రహదారిని నిర్మించడానికి పదమూడేళ్లు పట్టింది. రెండు అందమైన తీరప్రాంత నగరాలకు కలిపే ఈ రోడ్డు ‘గ్రేట్‌ ఓషియన్‌ రోడ్‌’గా 1932 నవంబర్‌లో అందుబాటులోకి వచ్చింది.  

ప్రయాణం.. సాహసోపేతం.. ఆహ్లాదం

ఈ రహదారిపై ప్రయాణమంటే సాహసం చేసినట్లే. ఈ రోడ్డులో అక్కడక్కడా వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. వంపులు కూడా చాలా ఉంటాయి. దీంతో వాహనాలను అత్యంత జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. రోడ్డు పొడవున ఒకవైపు సముద్రం, బీచ్‌లు.. మరోవైపు కొండలు, అడవులు ఆకట్టుకుంటాయి. అందుకే ఈ రహదారిపై లాంగ్‌ డ్రైవ్‌ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యటకులు వస్తుంటారు. 2004లో ఈ రోడ్డుకు పాదచారుల బాటను సైతం నిర్మించారు. 2011లో ఆస్ట్రేలియా నేషనల్‌ హెరిటేజ్‌ సైట్‌ ఈ రహదారి ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధస్మారకమని అభివర్ణించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని