AP News: ఏపీ మంత్రులను అడ్డుకున్న స్థానికులు.. దొమ్మేరులో ఉద్రిక్తత

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Updated : 16 Nov 2023 17:18 IST

దొమ్మేరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీ వివాదంలో పోలీసులు వేధించారని తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్సీ యువకుడు మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హోంమంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, కలెక్టర్‌, డీఐజీ గ్రామానికి రాగా.. స్థానికులు, మృతుడి స్నేహితులు మంత్రులను అడ్డుకున్నారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్థులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు అరగంట పాటు మంత్రులు గ్రామం వెలుపలే వేచి ఉండాల్సి వచ్చింది.

ఈక్రమంలో పోలీసులు, గ్రామస్థుల మద్య తోపులాట జరిగింది. ఆందోళన కారులను చెదరగొట్టిన పోలీసులు.. మంత్రులను మహేంద్ర ఇంటి వద్దకు అతికష్టం మీద తీసుకొచ్చారు. మహేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం.. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ కృష్ణ రూ.10లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి మేరుగ నాగార్జున రూ.10లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. పోలీసుల చర్యల వల్లే మహేంద్ర చనిపోయాడని గ్రామస్థులు ఆరోపించారు. హోం మంత్రి తానేటి వనిత విజయం కోసం మహేంద్ర పనిచేశాడని, పోలీసులు నిర్బంధించారంటే హోం మంత్రి పట్టించుకోలేదని, ఆమె దృష్టికి తీసుకెళ్లినా ఒక్క ఫోన్‌ కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో తానేటి వనిత ఎలా గెలుస్తారో చూస్తామంటూ మృతుడి బంధువుల శాపనార్థాలు పెట్టారు.

వెలుగులోకి మహేంద్ర వాంగ్మూలం..

ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహేంద్ర వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. తన చావుకు కారణం కొవ్వూరు స్టేషన్‌ ఎస్‌ఐ భూషణం, వైకాపా నాయకులు నాగరాజు, సతీష్‌ అని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహేంద్ర కోరాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని