Pinnelli: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్లపై తీర్పు రిజర్వ్‌

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. 

Updated : 27 May 2024 20:25 IST

అమరావతి: ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) దాఖలు చేసిన మూడు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు (AP Highcourt) తీర్పును రిజర్వు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారం ఇస్తామని తెలిపింది. ఎన్నికల పోలింగ్‌ సమయంలో పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయగా..  అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే, ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళపైనా దుర్భాషలాడారు. కారంపూడిలో  సీఐపై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి.

ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉద్దేశపూర్వకంగానే పిటిషనర్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారన్నారు. పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించే సమయంలో హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి తనకు సూచనలు అందాయన్నారు. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిలు మంజూరు చేయవద్దని కోరారు. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు.  

పిన్నెల్లి దాడి బాధితుడు సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. హత్యాయత్నం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాంటి వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని