AP News: పీఆర్సీ ఇస్తామంటున్నాం.. ఐఆర్‌ ఎందుకు?: మంత్రి బొత్స

‘మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదు. పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తాం’ ఇదే విషయాన్ని ఉద్యోగులకు చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 23 Feb 2024 17:45 IST

అమరావతి: ‘మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదు. పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తాం’ ఇదే విషయాన్ని ఉద్యోగులకు చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.

గతంలో కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించలేకపోయామని, అందుకే మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తామన్నామని తెలిపారు. తాము పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు.. ఇక ఐఆర్‌ ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం యోచన చేస్తోందన్నారు. కోర్టు కేసుల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందని, ప్రభుత్వం అన్ని అంశాల్లో ప్రజాస్వామ్య బద్ధంగానే వ్యవహరిస్తోందని తెలిపారు. తాడేపల్లిగూడెం సభపై బొత్స వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఏమీ చేయలేకపోతే అవి ప్రతిపక్షాలు ఎలా అవుతాయన్నారు. పండుగ ముందు గంగిరెద్దులు వచ్చినట్టే ఎన్నికల ముందు ప్రతిపక్షాలు వస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గంటా ఓడిపోయి ఆయన రికార్డు అతనే చెరిపేసుకుంటారని బొత్స వ్యాఖ్యానించారు.

జీవోలను బట్టి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం: బండి శ్రీనివాసరావు

ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతాయని, జీవోలు ఇచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. 49 డిమాండ్‌లు ప్రభుత్వం ముందు పెట్టామన్నారు.  30శాతం ఐఆర్‌ అడిగితే ప్రభుత్వం పీఆర్సీ ఇస్తామని చెబుతోందన్నారు. జీవోలను బట్టి తమ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. గత సమావేశంలో చెప్పిన అంశాలనే ప్రభుత్వం మళ్లీ చెప్పిందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని