Harish rao: మెడికల్‌ కాలేజీల్లో త్వరలో 1,400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ: హరీశ్‌రావు

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో త్వరలో 1,400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వెల్లడించారు. పేట్లబురుజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘ఇన్‌ఫెక్షన్ల నివారణ- అవగాహన’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Published : 20 Feb 2023 14:46 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో త్వరలో 1,400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీతో తెలంగాణలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని తెలిపారు. నిమ్స్‌(NIMS)లో 250 పడకలు, గాంధీ(Gandhi Hospital)లో 200 పడకలతో ఎంసీహెచ్‌ (మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌) ఆసుపత్రులు తీసుకువస్తున్నామని ప్రకటించారు. కేసీఆర్ కిట్, మిడ్ వైఫరీ వ్యవస్థ, అమ్మ ఒడి వాహనాలు, న్యూట్రిషన్ కిట్ వంటి సదుపాయాలు గర్భిణీలకు కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబురుజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘ఇన్‌ఫెక్షన్ల నివారణ- అవగాహన’ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. 

మాతా శిశు మరణాల విషయంలో రాష్ట్రం చాలా మెరుగైందని.. అయినప్పటికీ మరణాలకు గల కారణాలపై లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో మాతా శిశుసంరక్షణ ఆసుపత్రుల సంఖ్య పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. మాతా శిశు మరణాల్లో ఒకప్పుడు తెలంగాణ ఐదు, ఆరు స్థానంలో ఉందన్నారు. ఏడాదికి లక్షకు 43 మాతాశిశు మరణాలతో ఇప్పుడు మూడో స్థానంలో ఉందని మంత్రి వివరించారు. సంగారెడ్డి జిల్లాలో 82శాతం ప్రసవాలు అంటే సగటున నెలకు 1,400 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయని వెల్లడించారు. ప్రసవమైన తర్వాత బాలింతలకు ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయోమో పరిశీలించాలని.. పూర్తిగా పరీక్షించాకే ఇంటికి పంపాలని సూచించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలపాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీల సమస్యలు గుర్తించగలిగితే మరణాల సంఖ్య తగ్గించవచ్చని మంత్రి అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని