KTR: పాపికొండలు, కోనసీమను తలదన్నేలా సిరిసిల్ల అభివృద్ధి: కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి ఆవిష్కరించారు.

Updated : 18 Aug 2023 18:52 IST

సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి ఆవిష్కరించారు. రూ.3.16 కోట్లతో మధ్యమానేరు జలాశయంలో విహారానికి ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ బోటును నడిపి సందడి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

టాటాలు, బిర్లాలే కాదు.. తాతల నాటి కులవృత్తులూ బతకాలి

‘‘ఇంతకుముందు సిరిసిల్లకు వస్తే చుక్కనీరు కనిపించక పోయేది. నేడు పాపికొండలు, కోనసీమను తలదన్నే విధంగా సిరిసిల్ల అభివృద్ధి చెందింది. మధ్యమానేరులో మత్స్య సంపదను పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మా ప్రాంతాన్ని మెచ్చుకొంటుంటే నా గుండె సంతోషంతో నిండిపోతుంది. టాటాలు, బిర్లాలే కాదు.. తాతల నాటి కులవృత్తులు కూడా బతకాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం. సిరిసిల్లతో పాటు జిల్లా మండల కేంద్రాల్లోనూ నీరా కేఫ్‌లు ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్‌ను కోరుతున్నా. గీత కార్మికులు చెట్టుపై నుంచి పడి గాయాలపాలు కాకుండా సేఫ్టీ మోకులు అందజేస్తాం’’ అని మంత్రి హామీ ఇచ్చారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి పాలనలో నేతన్నలు, గౌడ వృత్తిదారులు ఎంతో మంది చనిపోయినా పట్టించుకోలేదు. వారికి ఎన్నో వేధింపులు ఉండేవి.. ఇప్పుడు అలాంటివి లేవు. వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మరిన్ని ఉపాధి సదుపాయాలు కల్పిస్తున్నాం. సేఫ్టీ మోకుల తయారీ, పరీక్షల అనంతరం వాటిని కచ్చితంగా గీతన్నలకు పంపిణీ చేస్తాం’’ అని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు