Tummala Nageswara Rao: ప్రైవేటు వ్యక్తుల వద్ద విత్తనాలు కొనొద్దు.. రైతులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట పత్తి సహా.. పచ్చిరొట్ట విత్తనాలు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Published : 03 Jun 2024 22:00 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట పత్తి సహా.. పచ్చిరొట్ట విత్తనాలు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన ఉందన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనందున పచ్చిరొట్ట, పత్తి విత్తనాల ప్యాకెట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. మాయ మాటలు చెప్పి విక్రయించే ప్రైవేటు వ్యక్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. 

ఇప్పటి వరకు 84,43,474 పత్తి విత్తనాల ప్యాకెట్లు సరఫరా జరిగిందని, 25 లక్షలకు పైగా రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 84,412 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కూడా విక్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు మరో నాలుగైదు రోజుల్లో రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. అనుమతి లేకుండా పత్తి విత్తనాలు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి.. రూ.లక్షల విలువైన 118.29 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పిన అధికారులు.. పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని