Uttam Kumar Reddy: ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దు: మంత్రి ఉత్తమ్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 15 Apr 2024 20:34 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నట్లు ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఏర్పాటుచేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు, రేషన్ సరఫరాల్లో ప్రభుత్వం సమర్ధవంతంగా ముందుకువెళ్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఈ ఏడాది తప్ప.. గతంలో ఎప్పుడూ సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరగలేదన్నారు. 

అది మా గ్యారంటీ

‘‘మేం ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. ఇది మా గ్యారంటీ. గత ఏడాది 7,031 కొనుగోలు కేంద్రాలు ఉంటే.. ఇప్పుడు 7,149 ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పటికే 6,919 కేంద్రాలు ప్రారంభించాం. కొన్నిచోట్ల ట్రేడర్లు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వెంటనే రవాణా చేసేలా ఆదేశాలిచ్చాం. రైతులకు ధాన్యం డబ్బులు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం. తెలంగాణ రైతులు ఒక్క గింజ ధాన్యం కూడా కనీస మద్దతు ధరకు తక్కువకు అమ్ముకోవద్దు. వ్యవసాయ ఉత్పత్తులలో లాభనష్టాలను చూడకుండా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అస్తవ్యస్తం చేసింది. ప్రతీ జిల్లాలో రేషన్ బియ్యం రీసైకిలింగ్ మాఫియా తయారైంది’’ అని ఉత్తమ్‌ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని, జూన్ 9వ తేదీన ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని