Uttam Kumar Reddy: ఎల్‌అండ్‌టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌ ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి సచివాలయంలో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.

Updated : 18 Dec 2023 16:05 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి సచివాలయంలో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకంగా, ఇంత నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. మేడిగడ్డ ఘటనపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్నారం, సుందిల్ల బ్యారేజీలను కట్టిన ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

ఇదీ జరిగింది..!

మేడిగడ్డ బ్యారేజీలో (Medigadda barrage) కుంగిన ప్రాంతాన్ని, దెబ్బతిన్న పియర్స్‌ను పునరుద్ధరించే పని తమది కాదని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ (L&T )ఇటీవల స్పష్టం చేసింది. దానికి అయ్యే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అందుకోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని పేర్కొంది. బ్యారేజీ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజినీర్లు అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. తాజాగా ఇందుకు భిన్నంగా  నిర్మాణ సంస్థ లేఖ రాయడం, దీనిపై తదుపరి చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్సీ) కింది స్థాయి ఇంజినీర్లకు ఆ లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. బ్యారేజీ కుంగిన చోట పియర్స్‌, పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్‌ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ నిర్మాణానికి రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎల్‌అండ్‌టీ ఈ నెల 2న కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ(రామగుండం) వెంకటేశ్వర్లుకు లేఖ రాసింది. ఈ లేఖను ఈ నెల 5న సంబంధిత ఎస్‌ఈకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు. దెబ్బతిన్న బ్లాక్‌ను, పియర్స్‌ను పునరుద్ధరించడానికి సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చు కావొచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా పేర్కొంటూ వచ్చింది.

మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలివ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం ఆదివారం తన నివాసంలో ఇంజినీర్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు, వాటికి చేసిన ఖర్చుల వివరాలను అందజేయాలని సూచించారు. అంతేకాకుండా, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్‌ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని