TS News: నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన.. ఈఎన్‌సీ రాజీనామాకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశం

నీటి పారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది.

Updated : 07 Feb 2024 21:54 IST

హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు చేపట్టింది. రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.. ఈఎన్‌సీ జనరల్‌ మురళీధర్‌రావు రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదేశించారు. మరికొందరు ఇంజినీర్లపైనా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ శాఖలో చాలా ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఇంజినీర్లపై వేటు వేసింది.

పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సర్వీసులో కొనసాగుతోన్న ఈఎన్‌సీ మురళీధర్‌రావును రాజీనామా చేయాలని మంత్రి ఆదేశించారు. రామగుండం ఈఎన్‌సీగా ఉండి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంప్‌హౌస్‌లకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్న వెంకటేశ్వర్లును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని