MLC Kavita: దిల్లీ బయల్దేరిన కవిత.. ఈడీ విచారణపై ఉత్కంఠ

ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత దిల్లీ బయల్దేరారు. ఇప్పటికే షెడ్యూల్‌ కార్యక్రమాలు చాలా ఉన్నందున..  ఆమె రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

Updated : 08 Mar 2023 18:00 IST

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) దిల్లీ బయల్దేరారు. ఇప్పటికే షెడ్యూల్‌ కార్యక్రమాలు చాలా ఉన్నందున..  ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం ఆమె దీక్ష చేయనున్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నేతలు, మహిళా సంఘాలను ఆహ్వానించారు. దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం రేపు, ఎల్లుండి ముందస్తు షెడ్యూల్‌ కార్యక్రమాలు ఉన్నాయని ఉదయమే కవిత ప్రకటన జారీ చేశారు. 

ఈ నేపథ్యంలో ఈడీని కూడా గడువు కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం కవిత దిల్లీ బయల్దేరారు. గురువారం ఉదయం విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ, ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, దీనిపై ఏం చేయాలనే దానిపై భారాస నేతలతో పాటు, న్యాయనిపుణులతో ఆమె చర్చించారు. అనంతరం కవిత దిల్లీ పయనమయ్యారు. అయితే, గురువారం ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత  హాజరయ్యే అవకాశం లేదని భారాస వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం మాత్రం కచ్చితంగా ధర్నా నిర్వహిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. భారత జాగృతి చేపట్టిన ధర్నా ఏర్పాట్ల కోసమే కవిత దిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు.

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో సౌత్‌ గ్రూప్‌లో కవిత కీలకపాత్ర పోషించారని, ఆమె తరఫున అరుణ్‌ రామచంద్ర పిళ్లై బినామీగా వ్యవహరించినట్టు ఈడీ రిమాండ్‌ రిపోర్టులో పలుమార్లు ప్రస్తావించింది. ఈక్రమంలో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు పిళ్లై కస్టడీ కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈడీ నోటీసుల నేపథ్యంలో గురువారం దిల్లీలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని