Expensive Dishes: వామ్మో! ఈ ఆహార పదార్థాలు మరీ ఇంత ఖరీదా..?

పుట్టిన రోజో, పండగ రోజో స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కెళ్లి పార్టీ చేసుకోవడం పరిపాటి. ఎంజాయ్‌ చేయడం వరకు బాగానే ఉంటుంది... బిల్లు కట్టినప్పుడే నొప్పి తెలుస్తుంది. ఏడాదికోసారేగా.. ఆ మాత్రం ఖర్చు చేయలేమా?

Published : 20 Aug 2021 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుట్టిన రోజో, పండగ రోజో స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కెళ్లి పార్టీ చేసుకోవడం పరిపాటి. ఎంజాయ్‌ చేయడం వరకు బాగానే ఉంటుంది... బిల్లు కట్టినప్పుడే నొప్పి తెలుస్తుంది. ఏడాదికోసారేగా.. ఆ మాత్రం ఖర్చు చేయలేమా? అనుకుంటే పర్వాలేదు. ఒకవేళ మీరు తరచూ ఇలాంటి పార్టీలు చేసుకునేవాళ్లే అయితే పొరపాటున కూడా ఇలాంటి ఈ ఆహార పదార్థాల జోలికి పోవద్దు. ఒకవేళ ఫ్రెండ్స్‌తో వెళ్లినా పర్సు నిండేంతగా డబ్బే కాకుండా, మీకున్న అన్ని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను తీసుకుపోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే వాటి రేట్లు ఆ రేంజ్‌లో ఉంటాయ్‌ మరి! ఇంతకీ ఆ ఖరీదైన ఆహార పదార్థాలేమిటో.. ఎక్కడ దొరుకుతాయో ఇప్పుడు చూద్దాం. 

సూరత్‌ స్పెషల్‌ ఘారి: గుజరాత్‌లో చండీ పడ్వా అనేది ఓ ముఖ్యమైన పండగ. శరద్‌ పూర్ణిమ తర్వాత రోజున ఈ పండగను జరుపుకుంటారు. ప్రధానంగా ఈ పండగకు గుజరాత్‌ ప్రజలు ‘ఘారి’ అనే స్వీట్‌ను తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. ఇదే స్వీట్‌ను సూరత్‌కు చెందిన ఓ మిఠాయి దుకాణదారుడు విభిన్నరీతిలో తయారుచేశాడు. బంగారం పూతతో ‘ఘారి’ని సిద్ధం చేశాడు. ఇంతకీ దీని ధర జస్ట్‌ కిలో రూ.9 వేలేనంట! సాధారణ ఘారీ మిఠాయి అయితే దుకాణం బట్టి రూ.600 నుంచి రూ.800 వరకు ఉంటుంది. బంగారం కదా మరి ఆమాత్రం ఉండొద్దా ఏం?


దిల్లీ స్పెషల్‌ కిళ్లీ: మిఠాయి కిళ్లీ అలా నోట్లో వేసుకుంటే అలా స్వర్గపు అంచుల వరకు వెళ్లొచ్చినట్లు ఉంటుంది. సాధారణంగా మన దగ్గర రూ.10 నుంచి రూ.50 వరకు ఉంటుంది. కానీ ఈ స్పెషల్‌ మిఠాయి పాన్‌ ధర కేవలం రూ.600 మాత్రమే. ఇది కావాలంటే అలా మన దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ వరకు వెళ్లాల్సిందే. ఇక్కడి యమూస్‌ పంచాయత్‌ అనే పాన్‌ షాప్‌ యజమాని బంగారం పూత పూసిన పాన్‌ను తయారు చేస్తున్నారు. పూర్తిగా డ్రై ఫ్రూట్స్‌తో రూపొందించిన స్వీట్‌ పాన్‌పై గోల్డ్‌తో తయారు చేసిన పేపర్‌ను అతికించి ఇస్తారు. అందుకే దీనికి అంత ధరన్నమాట!


దోసేసి.. బంగారం పూతేసి:  సాధారణంగా మనం హోటల్లో తినే దోసె ఓ ముప్పైయ్యో, నలభయ్యో ఉంటుంది. కాస్త వెరైటీ కవాలనుకుంటే మహాఅయితే ఓ వందో, రెండువందలో ఉంటుంది. అయితే  ఇక్కడ కనిపించే దోసె ధర వింటే షాక్‌ అవ్వాల్సిందే. దీని ధర ఏకంగా రూ.1100. బెంగళూరులోని రాజ్‌బోగ్‌ అనే రెస్టారెంట్‌లో ఇది దొరుకుతుంది. సాధారణ దోసెపై 24 క్యారెట్ల బంగారు పూతను అతికించి ఇస్తారు. అంతేకాదు ఈ రెస్టారెంట్లో సుమారు 101 రకాల దోసెలు విక్రయిస్తుండడం గమనార్హం. 


ఇది 24 క్యారెట్ల ఐస్‌క్రీమ్‌: ఇప్పుడు హాంకాంగ్‌ వెళ్దాం పదండి. ఇప్పుడు అక్కడికెందుకు అంటారా..? మరి ఈ 24 క్యారెట్ల ఐస్‌క్రీమ్‌ దొరికేది అక్కడే మరి! ఇదో కోన్ ఐస్‌క్రీమ్‌. అలాగని కోన్‌ మొత్తం ఏమీ బంగారం ఉండదు. కేవలం ఐస్‌క్రీమ్‌ పైన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన ఓ పలుచని పేపర్‌ను ఉంచుతారు. మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర రూ.1000. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి  ఆ మధ్య ఎప్పుడో హాంకాంగ్‌ వెళ్లినప్పుడు ఈ ఐస్‌క్రీమ్‌ తిని ఇన్‌స్టాలో పంచుకుంది.


బిర్యానీ.. ₹20 వేలంట!: దుబాయ్ అంటే మనవాళ్లకు వెంటనే గుర్తొచ్చేది బంగారమే. ఈ ‘రాయల్‌ గోల్డెన్‌ బిర్యానీ’ కూడా లభించేది అక్కడే. అతి ఖరీదైన బిర్యానీగా పేరున్న ఈ బిర్యానీని ఇక్కడి బొంబాయి బరో అనే రెస్టారెంట్‌ తయారుచేస్తోంది. అన్నట్లు ఇది భారతీయుల రెస్టారెంటే. ఓ బంగారం పల్లెంలో బిర్యానీ వేసి దానిపై 23 క్యారెట్ల తినదగిన బంగారపు రేకులను అలంకరించి వడ్డిస్తారు. అందుకే దీని ధర రూ.20వేలు మరి. అంతేకాదు.. కీమా రైస్​, వైట్​రైస్​, సాఫ్రాన్ రైస్‌ ఇలా మూడు రకాల రైస్‌లను వడ్డిస్తారు. దానిపై చిన్న చిన్న బంగాళా దుంపలు, ఉడికించిన కోడిగుడ్లు, వేయించిన జీడిపప్పుతో అలంకరిస్తారు. వింటుంటేనే నోరూరిపోతోంది కదూ!!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని