Tourism: అత్యధికులు సందర్శించే దేశాలివే..!

గత ఏడాదిన్నర కాలం పర్యటక రంగం దారుణంగా దెబ్బతింది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అన్ని దేశాల్లోనూ ఈ రంగం కుదేలయింది. కరోనా ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని దేశాలు పర్యటకులను ఆహ్వానిస్తున్నాయి. దీంతో కరోనా నిబంధనలు పాటిస్తూ.. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత

Updated : 16 Nov 2021 11:38 IST

గత కొన్ని నెలలుగా పర్యటక రంగం దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అన్ని దేశాల్లోనూ ఈ రంగం కుదేలయింది. కరోనా ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చాలా దేశాలు పర్యటకులను ఆహ్వానిస్తున్నాయి. దీంతో కరోనా నిబంధనలు పాటిస్తూ.. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత విదేశాల్లో పర్యటించాలని కొందరు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఏ దేశానికి వెళ్తే బాగుంటుంది? ఎక్కువ మంది వెళ్లే పర్యటక ప్రాంతాలేవి? అని గూగుల్‌ చేస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా (కరోనాకు ముందు) అత్యధిక మంది సందర్శిస్తున్న దేశాల జాబితాను వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ సంస్థ రూపొందించింది. పర్యటకుల గణాంకాల ప్రకారం జాబితాలోని టాప్‌ టెన్‌ దేశాలేవో ఓసారి చూద్దాం..

1. ఫ్రాన్స్‌

పర్యటక రంగంలో బాగా ప్రఖ్యాతిగాంచిన దేశం ఫ్రాన్స్‌. ఏటా 8.9కోట్ల మంది ఇక్కడికి వస్తుంటారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ను 1.7కోట్ల మంది సందర్శిస్తారు. వారిలో 70లక్షల మంది ఈఫిల్‌ టవర్‌ చూడటానికే వస్తుంటారట. ఆ దేశ స్థూల జాతీయ ఉత్పత్తి(డీజీపీ)లో పర్యటక రంగం వాటా 9.7శాతం. ఫ్రాన్స్‌లో ఈ రంగం దాదాపు 30లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. లావ్రె మ్యూజియం, ఈఫిల్‌ టవర్‌, ప్యాలెస్‌ ఆఫ్‌ వెర్సయిల్స్‌ వంటి అనేక సందర్శక ప్రాంతాలున్నాయి. ఇతర ఖండాల్లోని దేశాల కంటే యూరప్‌ దేశాల ప్రజలే ఫ్రాన్స్‌ను ఎక్కువగా సందర్శిస్తుండటం విశేషం. 


2. స్పెయిన్‌

యూరప్‌లోని మరో దేశం స్పెయిన్‌ అత్యధిక పర్యటకులు సందర్శించే రెండో దేశంగా నిలిచింది. ఆ దేశ ఆర్థికవ్యవస్థలో 12శాతం ఈ రంగానిదే. దేశవ్యాప్తంగా 13శాతం ఉద్యోగాలు ఈ రంగంలోనే ఉన్నాయట. ఇక్కడ వేడి వాతావరణం, సహజంగా ఏర్పడిన బీచ్‌లు, నిత్యం సందడిగా ఉండే నగరాలు కోట్లమంది పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. ఏటా ఇక్కడికి 8.3కోట్ల మంది వస్తుంటారు. మాడ్రిడ్‌లోని రాయల్‌ ప్యాలెస్‌, రన్నింగ్‌ ఆఫ్‌ ది బుల్స్‌ క్రీడ, సాగ్రడా ఫామిలియా చర్చ్‌, అలంబ్రా కోట వంటి ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.


3. అమెరికా

చాలామంది ఒక్కసారైనా వెళ్లాలనుకునే దేశం అమెరికా. కొంతమంది ఉద్యోగాల నిమిత్తం, మరికొంత మంది విహారయాత్ర నిమిత్తం వెళ్తుంటారు. అలా ఏటా 8కోట్ల పర్యటకులు అమెరికాను సందర్శిస్తున్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు 1.6 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు పర్యటక రంగం నుంచే వస్తాయట. 70లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. యూఎస్‌లోని న్యూయార్క్‌, లాస్‌ వేగాస్‌, లాస్‌ ఏంజిలెస్‌ ప్రాంతాల్లోనే అత్యధిక మంది పర్యటకులు వస్తుంటారని నివేదికలో వెల్లడైంది. అమెరికాను సందర్శించేవారిలో కెనడా, మెక్సికో, యూకె, జపాన్‌, చైనా దేశస్తులు ఎక్కువగా ఉంటారట.


4. చైనా

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. అక్కడి ప్రజలు ఒకవైపు ఆధునికతను అందుకుంటూనే.. మరోవైపు సంప్రదాయాల్ని, ఆధ్యాత్మికతను అనుసరిస్తుంటారు. ఎంతో ప్రాచీన చరిత్ర గల ఈ దేశంలో ఏటా 6.3కోట్ల మంది సందర్శకులు పర్యటిస్తుంటారు. అక్కడి గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా సహా పలు పురాతన కట్టడాలు, ఆలయాలు, వంటకాలు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా వల్ల ఈ ఏడాది చైనాలో పర్యటక రంగం నెమ్మదించింది. కానీ ఈ రంగంలో క్రమంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనానే. 2019లో చైనా దేశ జీడీపీలో 12.6శాతం పర్యటక రంగానిదే కావటం విశేషం. 


5. ఇటలీ

ప్రపంచదేశాలతో పోలిస్తే.. ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతిగల దేశం ఇటలీ. ఈ దేశంలో 50కిపైగా పర్యటక ప్రాంతాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కించున్నాయి. రోమ్‌, నేపిల్స్‌, ఫ్లారెన్స్‌, నీళ్లపై తేలియాడినట్లు ఉండే వెనీస్‌ నగరం వంటి ప్రాంతాలు పర్యటకుల మనసు దోచేస్తాయి. లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా వంటి కట్టడాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ అందాలను చూడటానికే ఏటా 6.2కోట్ల మంది పర్యటకులు ఇటలీకి వస్తుంటారు.


6. టర్కీ

ఆసియా, ఐరోపా ఖండాలకు మధ్య టర్కీ ఉండటం విశేషం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యటక రంగం ముఖ్యపాత్ర పోషిస్తోంది. గత రెండు దశాబ్దాలలో టర్కీలో పర్యటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఉండే ప్రాచీన, వైవిధ్య భవనాలు, బీచ్‌లు, రిసార్టులు, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులు పర్యటకులకు తెగ నచ్చేస్తాయి. ముఖ్యంగా అంతల్యా నగరం రిసార్టులకు పెట్టింది పేరు. ఏటా టర్కీని 4.6కోట్ల మంది సందర్శకులు పర్యటిస్తుంటే.. 2019లో అంతల్యాను 1.5కోట్ల మంది సందర్శించారట. నీలిరంగు మసీదులు, టాప్కాపి ప్యాలెస్‌, హగియా సోఫియా మ్యూజియం సందర్శక ప్రాంతాల్లో ముఖ్యమైనవి. ఈ దేశానికి విశాల తీర ప్రాంతం ఉండటం కలిసొచ్చే విషయం.


7. మెక్సికో

ఉత్తర అమెరికాకు దక్షిణంవైపు ఉన్న దేశం మెక్సికో. ఈ మధ్య కాలంలో పర్యటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదీ ఒకటి. సహజసిద్ధంగా ఏర్పడిన బీచ్‌లను చూడటానికి, మెక్సికో చరిత్ర.. సంస్కృతిని తెలుసుకోవడం కోసం పర్యటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఏటా 4.1కోట్ల మంది మెక్సికోను సందర్శిస్తున్నారు. ఈ దేశంలోని నిరుద్యోగుల్లో చాలామందికి పర్యటక రంగమే ఉపాధి కల్పించడం విశేషం. ఈ రంగం అభివృద్ధి కోసం మెక్సికో ప్రభుత్వం ఆరేళ్ల ప్రణాళికను రచించింది. మెక్సికో నగరం, కాంకున్‌, ప్లాయా డెల్‌ కార్మెన్‌ వంటి సందర్శక ప్రాంతాలు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి.


8. జర్మనీ

జర్మనీ చరిత్ర చూస్తే నియంత పాలన, యుద్ధాలే కనిపిస్తాయి. కానీ పర్యటక రంగంలో టాప్‌ టెన్‌ జాబితాలో స్థానం సంపాదించింది. ఇక్కడి మద్యం, అద్భుతమైన కోటలు పర్యటకులను కట్టిపడేస్తాయి. ఏటా జర్మనీకి 3.1కోట్ల మంది పర్యటకులు వస్తుంటారు. ఆ దేశ రాజధాని బెర్లిన్‌ను 1.3కోట్ల మంది పర్యటిస్తారట. ఈ రంగంలో దాదాపు 20లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.


9. థాయ్‌లాండ్‌ 

కొన్ని దశాబ్దాలుగా థాయ్‌లాండ్‌ పర్యటక రంగంలో వృద్ధి సాధిస్తోంది. ఇక్కడి 1,400లకుపైగా ఐలాండ్స్‌, తెల్ల ఇసుక బీచ్‌లు, రుచికరమైన ఆహారం, వేడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి పర్యటకులు మొగ్గు చూపుతుంటారు. ముఖ్యంగా థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌.. ఎక్కువ మంది పర్యటకులు సందర్శించే ప్రాంతంగా నిలుస్తుంటుంది. థాయ్‌లాండ్‌ను ఏటా 3.8కోట్ల మంది పర్యటిస్తుంటే.. బ్యాంకాక్‌కు 2.2 కోట్ల మంది వస్తుంటారు. బ్యాంకాక్‌లోని గ్రాండ్‌ ప్యాలెస్‌, రైలే బీచ్‌, కొ ఫి ఫి వంటి ప్రాంతాలు ఆకట్టుకుంటాయి. 


10. యునైటెడ్‌ కింగ్‌డమ్‌

గతేడాది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను 3.6కోట్ల మంది పర్యటకులు సందర్శించారట. యూకెలో అత్యధికమంది సందర్శిస్తున్న నగరంగా లండన్‌ నిలుస్తోంది. ఏటా కేవలం లండన్‌ నగరాన్నే 1.2కోట్ల మంది సందర్శిస్తున్నారు. ఈ దేశంలో పర్యటక రంగం 131బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాదు.. 20లక్షల ఉద్యోగాలను కల్పిస్తోంది. యూకేని సందర్శించేవారిలో అత్యధికులు అమెరికన్లే ఉండటం విశేషం. బిగ్‌బెన్‌, ది టవర్‌ ఆఫ్‌ లండన్‌, లండన్‌ బ్రిడ్జ్‌, స్టోన్‌హెంజ్‌ తదితర ప్రాంతాలు ఆకట్టుకుంటాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని