అమ్మ కడుపులో నుంచే పాప్‌ ఆల్బమ్‌ చేసేసింది!

ఆ ఆలుమగలిద్దరూ పేరున్న మ్యూజిక్‌ బ్యాండ్‌లో సంగీతకళాకారులు. వారి చిన్నారి పాప కూడా ఓ ప్రత్యేక ఆల్బమ్‌ రూపొందించింది. అయితే ఏంటి.. తల్లిదండ్రుల కళనే వారి బిడ్డకు అబ్బింది. అందులో ఏముంది గొప్ప అంటారా..? నిజమే కానీ, ఆ పాప భూమిపైకి రాకముందే.. అంటే అమ్మ

Updated : 12 Feb 2021 11:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ ఆలుమగలిద్దరూ పేరున్న మ్యూజిక్‌ బ్యాండ్‌లో సంగీత కళాకారులు. వారి చిన్నారి పాప కూడా ఓ ప్రత్యేక ఆల్బమ్‌ రూపొందించింది. అయితే ఏంటి.. తల్లిదండ్రుల కళే వారి బిడ్డకు అబ్బింది. అందులో ఏముంది గొప్ప అంటారా..? నిజమే కానీ, ఆ పాప భూమిపైకి రాకముందే.. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే సంగీతం సమకూర్చింది. త్వరలో ఆ ఆల్బమ్‌ విడుదల చేసేందుకు ఆ తల్లిదండ్రులు సన్నాహాలు చేస్తున్నారు. నమ్మశక్యంగా లేకున్నా.. ఇది వాస్తవం!

అమెరికాకు చెందిన ఎలిజబెత్‌ హర్ట్‌ సైకిక్‌ ఇల్స్‌ అనే రాక్‌ బ్యాండ్‌లో సభ్యురాలు. ఆమె భర్త ఇవాన్‌ డియజ్‌ మాతె కూడా అదే బ్యాండ్‌లో సంగీతకళాకారుడు. ఎలిజబెత్‌ గర్భిణి అయ్యాక అల్ట్రాస్కానింగ్‌ చేసినప్పుడు కడుపులో బిడ్డ కదలికలను గమనించారు. అప్పుడే బిడ్డ కదలిక ద్వారా వెలువడే కంపనాలతో సంగీతం సృష్టిస్తే ఎలా ఉంటుందని ఎలిజబెత్‌-డియజ్‌ దంపతులకు ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా వైద్య, సంగీత సాంకేతికత సహాయంతో ఆల్బమ్‌ను రూపొందించారు. ఇందుకోసం బయోసోనిక్‌ ఎంఐడీఐ టెక్నాలజీని వాడారు. ఎలక్ట్రోడ్లను ఎలిజబెత్‌ కడుపుపై అమర్చి.. గర్భంలో ఉన్న బిడ్డ కదలికలతో వచ్చే కంపనాలను సింథసైజర్‌తో శబ్దాలుగా మార్చారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎలిజబెత్‌ యోగా చేసే సమయంలో ఐదుగంటల పాటు ఈ రికార్డింగ్‌ నిర్వహించారు. ఆ తర్వాత ఎలిజబెత్‌ పండంటి పాపకు జన్మనిచ్చింది. తనకి లూకా యూపాన్క్వి అని పేరు పెట్టారు. 

ఇదంతా గతేడాదిలో జరిగింది. అయితే, ప్రస్తుతం ఆ రికార్డింగ్స్‌ను ఎడిట్‌ చేసి పది పాటల ఆల్బమ్‌గా మార్చుతున్నారు. సాకర్డ్‌ బోన్స్‌ రికార్డ్స్‌ అనే సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 2న ‘సౌండ్స్‌ ఆఫ్‌ అన్‌బార్న్‌’ పేరుతో ఈ ఆల్బమ్‌ విడుదల కానుంది. ఆల్బమ్‌ రూపకల్పనలో చిన్నారి లూకా కూడా పాల్గొంటుందట. తను కడుపులో ఉన్నప్పుడు వెలుబడిన శబ్దాలను లూకా గుర్తుపడుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. లూకా కడుపులో ఉండగా రికార్డ్‌ చేసిన శబ్దాలకు సంబంధించిన ఒక వీడియో సాకర్డ్‌ బోన్స్‌ రికార్డ్స్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఇటీవల పెట్టింది. ఆల్బమ్‌ కొనాలంటే తమ వెబ్‌సైట్‌లో ప్రీఆర్డర్‌ చేయొచ్చని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని