National Flag: జాతీయ జెండా ఆవిష్కరణ వెనుక ఆసక్తికర అంశాలు

దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వారందరినీ మువ్వెన్నెల జెండా ఒక్కతాటిపైకి తెచ్చింది. అలాంటి జెండా ఆవిష్కరణ వెనక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి....

Updated : 21 Nov 2021 15:33 IST

దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వారందరినీ మువ్వెన్నెల జెండా ఒక్కతాటిపైకి తెచ్చింది. అలాంటి జెండా ఆవిష్కరణ వెనక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువాడే. ఆయనే కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారత ప్రభుత్వం తొలిసారిగా 1947, నవంబర్‌ 21న త్రివర్ణ జెండాతో కూడిన పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 100 ఏళ్ల కిందట రూపుదిద్దుకున్న మువ్వన్నెల జెండా పుట్టుక, ఆవిష్కరణ, పింగళి వెంకయ్య కృషిపై ప్రత్యేక కథనం.

ఇప్పటి జాతీయ పతాకానికి మాతృక పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకమే. స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చిన ఈ జెండా 1921లో ప్రాణం పోసుకుంది. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ, ఇతర నాయకులు జాతీయ పతాకాలు రూపొందించినా.. అవి సామన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ, పింగళి రూపొందించిన ఈ పతాకమే జాతీయ ఉద్యమానికి దిక్సూచి అయ్యింది. నేటి భారత జాతికి హృదయ పతాకంగా నిలిచింది.

మనసులో మెదిలింది అప్పుడే..!

ఒక జాతికి, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్యకు 1906లోనే కలిగింది. దీనికి కారణం కోల్‌కతాలో 1906లో జరిగిన 22వ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభ, సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడం పింగళి వెంకయ్యను కలత పరిచింది. ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనస్సులో మెదిలింది. ఆ సభలోనే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంకయ్య ప్రతిభను గుర్తించిన పెద్దలు, ఆయన్ని కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సమితి సభ్యుడిగా నియమించారు. ఆనాటి నుంచి జాతీయ జెండా ఎలా ఉండాలనే అంశాన్ని తన అభిమాన విషయంగా పెట్టుకొని దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్‌ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పనపై చర్చలు జరిపారు. జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య 1916లో ‘భారత దేశానికి ఓ జాతీయ పతాకం’ అనే ఓ ఆంగ్ల పుస్తకాన్ని సైతం రచించారు.

మొదట 1916లో లఖ్‌నవూలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో పింగళి వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్‌కు చెందిన లాలా హన్స్‌ రాజ్‌ పతాకంపై రాట్నం చిహ్నముంటే బాగుంటుందని సూచించగా.. గాంధీజీ అంగీకరించారు. ఆ తర్వాత 1921 మార్చి 31న విజయవాడలో ప్రస్తుతమున్న బాపూ మ్యూజియం, నాడు విక్టోరియా మహాల్‌లో గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పనపై పలుమార్లు చర్చించారు. ఈ సమావేశంలో వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతను బాపూజీ అప్పగించారు. ఆయన మూడు గంటల వ్యవధిలోనే జెండా నమూనాను తయారు చేసి గాంధీకి అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చరంగులతో పాటు చరఖా రాట్నం చిహ్నం అందులో ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో జాతీయ పతాకంలో మార్పులపై గాంధీ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ఎరుపు, ఆకుపచ్చ తెలుపురంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జెండాను తయారు చేశారు.

 ఆ ఒక్కటే మారింది..!

1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో కొందరు సభ్యులు పతాకంలోని రంగులపై అభ్యంతరం తెలిపారు. నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్, దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య రూపొందించిన జెండాలో మార్పులు చేసింది. ఈ మార్పులను కాంగ్రెస్‌ జాతీయ మహాసభ ఆమోదించింది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో జాతీయ జెండా గురించి నెహ్రూ ఓ తీర్మానం చేస్తూ.. మునుపటి త్రివర్ణపతాకంలో రాట్నం స్థానంలో అశోకుడి ధర్మ చక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే.. పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి త్రివర్ణ పతాకానికి ఏమీ తేడా లేదు.

చిరస్మరణీయుడు

దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేసే జెండాను రూపొందించిన వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 2న హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన వెంకయ్య.. దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దంపాటు నిలిచింది. పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తేవాలన్న కాంక్షను బలంగా మనసులో పెట్టుకున్న ఆయన.. ఆ దిశగా ఎంతో కృషి చేశారు. వృద్ధాప్యంలో ఆయన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మిలటరీలో పని చేసినందుకు విజయవాడ చిట్టినగర్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చిన్న గుడిసె వేసుకొని బతికారు. ఏనాడూ ఏ పదవినీ ఆశించని ఆయన.. 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న జెండా మాత్రం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని