Updated : 16 Feb 2021 10:22 IST

ఆ చెట్టును చూడాలంటే రిజర్వేషన్‌ ఉండాలి!

(Photo: Visit Xi'an facebook)

ఇంటర్నెట్‌ డెస్క్‌: వర్షాలు తగ్గి.. చలి మొదలయ్యే కాలాన్నే శరదృతువు అని పిలుస్తాం. ఈ కాలంలో కొన్ని రకాల చెట్లకు ఆకులు రాలిపోతుంటాయి. ఆకుపచ్చగా ఉండే చెట్ల ఆకులు.. వివిధ రంగుల్లోకి మారి రాలిపడుతుంటే.. నేలంతా పూలపాన్పులా కనిపిస్తుంటుంది. చైనాలోని గునియిన్‌ గుమియావో ఆలయంలోని ఓ చెట్టు కూడా శరదృతువులో ఆకులు రాల్చుతూ మనోహరంగా కనిపిస్తుంది. అయితే, ఈ చెట్టును చూడాలంటే మాత్రం ప్రజలు రిజర్వేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. చెట్టును చూడటం కోసం రిజర్వేషన్‌ చేసుకోవాలా అని ఆశ్చర్యపోతున్నారా? ఆ చెట్టుకు అంత ప్రాముఖ్యత ఉంది మరి..

చైనాటౌన్‌లోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని జోంగ్‌నాన్‌ పర్వతాల ప్రాంతంలో ఉందీ గునియిన్‌ గుమియవో అనే బౌద్ధుల ఆలయం. ఆ ప్రావిన్స్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఈ ఆలయంలో ఉన్న గింగ్‌కొ బిలోబా అనే చెట్టు పర్యటకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ రకం చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా ఈ ఆలయంలోని చెట్టు మాత్రం చాలా ప్రాచీనమైనది. ఈ చెట్టు 1400 సంవత్సరాల కిందటిదని, 618-907 మధ్య ఉన్న టాంగ్‌ రాజ్యాన్ని పరిపాలించిన లి షిమిన్‌ దీన్ని నాటినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టుగానూ ఇది గుర్తింపు పొందింది. ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు ఆకులు శరదృతువులో బంగారువర్ణంలోకి మారి రాలిపోతుంటాయి. ఆ ఆకులన్నీ నేలపై పడుతుంటే సుందరదృశ్యం ఆవిష్కృతమవుతుంటుంది. నేలంతా స్వర్ణశోభితంగా.. కనులవిందుగా కనిపిస్తుంది. నిజానికి, శరదృతువు ప్రారంభంలో ఈ చెట్టు వద్ద స్థానికులు మాత్రమే వేడుకలు నిర్వహించేవారు. కొన్నాళ్ల కిందట ఈ చెట్టు అందాలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో దేశవిదేశాల నుంచి పర్యటకుల రాక మొదలైంది.

సాధారణ రోజుల్లో భక్తులు, పర్యటకులు తక్కువగానే ఉన్నా.. అక్టోబర్‌ నెలఖారు నుంచి డిసెంబర్‌ తొలివారం వరకు కనీసం 60వేల మంది పర్యటకులు ఈ చెట్టును సందర్శిస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది. అయితే, పర్యటకులు భారీ సంఖ్యలో వస్తుండటంతో రోజుకు ఏడు నుంచి ఎనిమిది వేల మందిని అనుమతించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పర్యటకులు ఈ చెట్టును సందర్శించడం కోసం ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. రిజర్వేషన్‌ చేసుకొని వచ్చినా.. మూడు నుంచి నాలుగు గంటలు క్యూలో నిలబడితేనే ఆ చెట్టు దర్శన భాగ్యం కలుగుతోందట. ప్రస్తుతం కరోనా కారణంగా విదేశీ పర్యటకులు సంఖ్య తక్కువగానే ఉన్నా.. దేశీయ పర్యటకులు మాత్రం ఈ చెట్టును చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదీ చదవండి..

నీటిగుంటకు ఇన్‌స్టా ఖాతా.. దానికుందో పెద్ద కథ!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని