Bhatti: తెలంగాణలో కొత్తగా 100 రెసిడెన్షియల్‌ పాఠశాలలు: భట్టి

రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,500 కోట్లతో 100 రెసిడెన్షియల్‌ పాఠశాలలు నిర్మించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

Published : 22 Feb 2024 21:36 IST

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,500 కోట్లతో 100 రెసిడెన్షియల్‌ పాఠశాలలు నిర్మించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు వేర్వేరుగా కాకుండా ఒకే చోట నిర్మించనున్నట్టు చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్టును తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో చేపట్టనున్నట్టు వెల్లడించారు. మండల కేంద్రమైన చింతకానిలోని ఇండోర్‌ స్టేడియం సమీపంలో 10 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీ బాలుర, ఎర్రుపాలెం మండలంలో బాలికల సమీకృత రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల భవన సముదాయాల కోసం స్థలాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌కు దీటుగా భవనాలు నిర్మించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఒకేచోట నిర్మిస్తే స్థలాల సమస్య అధిగమించడంతో పాటు మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు.

నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ ద్వారా కోచింగ్‌..

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కోచింగ్‌ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలో టీఎస్‌పీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించనున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి నిరుద్యోగులకు కోచింగ్‌ భారం పడకుండా ఈకేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ ద్వారా కోచింగ్‌ ఇచ్చేలా ప్రణాళికలు చేయాలని విద్యాశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు