TSPSC: పోటీపరీక్షల నిర్వహణపై అనుమానాలున్నాయ్‌!.. విపక్షాల మండిపాటు

ప్రభుత్వంలో ఉన్నవారి స్వార్థంతో నిరుద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

Updated : 23 Sep 2023 18:35 IST

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పరీక్షలు పారదర్శకంగా జరగడం లేదనడానికి హైకోర్టు (HighCourt) తీర్పే నిదర్శనమని విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వంలో ఉన్నవారి స్వార్థంతో నిరుద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటిపై అనుమానాలున్నాయని ఆ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నో కష్టాలకోర్చి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ మండిపడ్డారు.

పోటీ పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకు సీఎం కేసీఆర్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అసమర్థ పాలన, వైఫల్యాలకు గ్రూప్‌-1 పరీక్ష రద్దుకావడమే నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి మద్యం నోటిఫికేషన్లపై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రభుత్వం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తీరును నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగ యువతీయువకులు ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని