పేద విద్యార్థుల కోసం పోలీసుల గ్యాడ్జెట్‌ బ్యాంక్‌!

ప్రజలను కాపాడుతూ, నేరాలను అరికట్టడమే కాదు.. సామాజిక బాధ్యతగా ప్రజలకు అవసరమైన సేవలు చేసేందుకు పోలీసుశాఖ ఎప్పుడూ ముందుంటుంది. ఈ విషయాన్ని ఝార్ఖండ్‌ పోలీసులు మరోసారి రుజువు చేశారు. పేదరికంతో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకాలేని విద్యార్థుల

Published : 10 Jul 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజలను కాపాడుతూ, నేరాలను అరికట్టడమే కాదు.. సామాజిక బాధ్యతగా ప్రజలకు అవసరమైన సేవలు చేసేందుకు పోలీసుశాఖ ఎప్పుడూ ముందుంటుంది. ఈ విషయాన్ని ఝార్ఖండ్‌ పోలీసులు మరోసారి రుజువు చేశారు. పేదరికంతో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకాలేని విద్యార్థుల కోసం గ్యాడ్జెట్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లు కొనలేని విద్యార్థులకు ఈ గ్యాడ్జెట్‌ బ్యాంక్‌ ద్వారా వాటిని అందజేస్తూ చదువుకు.. పేద విద్యార్థులకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తున్నారు. 

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరుకావాలంటే స్మార్ట్‌ఫోన్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు తప్పనిసరి. మరి వాటిని కొనే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? స్మార్ట్‌ఫోన్‌ లేక ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఇది గమనించిన ఝార్ఖండ్‌ పోలీసులు ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చారు. పేద విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేలా స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వడానికి గ్యాడ్జెట్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులకు పోలీసులు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఈ మంచి పనిలో ప్రజలను సైతం భాగమవ్వాలని కోరుతున్నారు.

ప్రజలు తమ వద్ద ఉండే పాత లేదా పాడైన మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఉంటే ఈ గ్యాడ్జెట్‌ బ్యాంక్‌కు ఇవ్వాలని కోరుతూ తాజాగా ఝార్ఖండ్‌ పోలీసులుశాఖ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టింది. ప్రజలు విరాళంగా ఇచ్చే ఫోన్‌, ల్యాప్‌ట్యాప్స్‌ను మరమ్మతులు చేసి, పాఠశాల యాజమాన్యాల సిఫార్సుల మేరకు పేద విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. విద్యాపరంగా మాత్రమే వీటిని ఉపయోగించాలని విద్యార్థుల నుంచి హామీ తీసుకుంటామని తెలిపారు.

దుర్వినియోగం కాకుండా హామీ

స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ వంటివి విరాళంగా ఇస్తే వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే, లేదా డివైజ్‌ దుర్వినియోగమయ్యే అవకాశముందని చాలా మంది భయపడుతుంటారు. దీనిపై కూడా పోలీసులు స్పష్టతనిచ్చారు. ఎవరైతే ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ విరాళంగా ఇస్తారో వారి వివరాలను నమోదు చేసుకుంటామని.. ఒక సర్టిఫికేట్‌ కూడా ఇస్తామని తెలిపారు. విరాళంగా ఇచ్చిన డివైజ్‌లు దుర్వినియోగం కాకుండా.. ఎప్పటికప్పుడు వాటిని మానిటర్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగినా దాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. 

ఆ అంతరాన్ని తొలగించడానికే: డీజీపీ

ఈ గ్యాడ్జెట్‌ బ్యాంక్‌ గురించి ఆ రాష్ట్ర డీజీపీ నీరజ్‌ సిన్హా మాట్లాడుతూ ‘‘స్మార్ట్‌ఫోన్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌ ఉన్న విద్యార్థులు ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతారు. కానీ, అవి లేని వారి సంగతేంటి? ఇలాంటి పరిస్థితుల వల్లే సమాజంలో అసమానతలు ఇంకా ఉన్నాయి. అన్ని వర్గాల విద్యార్థుల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడానికి, అందరికీ సమానంగా విద్య అందించడానికి మా వంతుగా ఈ కార్యక్రమం ప్రారంభించాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని