Space Agency: ప్రపంచంలో శక్తిమంతమైన స్పేస్‌ ఏజెన్సీలేవంటే..!

ప్రపంచంలో అభివృద్ధి చెందిన.. చెందుతున్న దేశాలన్నీ అంతరిక్ష పరిశోధనలపై దృష్టిసారించాయి. విశ్వ రహస్యాలు తెలుసుకోవడంలో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు సొంతంగా అంతరిక్ష పరిశోధన సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, వాటిలో కొన్ని దేశాలు మాత్రమే ఆ పరిశోధనలకు భారీగా బడ్జెట్‌ కేటాయిస్తూ

Published : 08 Nov 2021 14:46 IST

ప్రపంచంలో అభివృద్ధి చెందిన.. చెందుతున్న దేశాలన్నీ అంతరిక్ష పరిశోధనలపై దృష్టిసారించాయి. విశ్వ రహస్యాలు తెలుసుకోవడంలో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు సొంతంగా అంతరిక్ష పరిశోధన సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, వాటిలో కొన్ని దేశాలు మాత్రమే ఆ పరిశోధనలకు భారీగా బడ్జెట్‌ కేటాయిస్తూ.. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. అంతరిక్ష ప్రయోగాల్లో విజయాలు సాధిస్తున్నాయి. మరి ప్రపంచదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థల్లో శక్తిమంతమైనవేవో తెలుసుకుందాం ..

నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా)

అంతరిక్ష పరిశోధన కోసం అమెరికా ‘నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా)’  సంస్థను ఏర్పాటు చేసింది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీ. అక్కడి ప్రభుత్వంలో ఏ శాఖ కూడా దీన్ని నియంత్రించలేదు. నాసాకు సంబంధించిన విషయాల్లో నేరుగా అమెరికా అధ్యక్షుడిని సంప్రదించే అవకాశం ఉంటుంది. దీన్ని 1958లో స్థాపించారు. చంద్రుడి వద్దకు వెళ్లేందుకు నాసా 1967లో అపోలో-1 మిషన్‌ ప్రారంభించగా అది విఫలమైంది. ఆ తర్వాత కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు 1969లో చేపట్టిన అపోలో-11 మిషన్‌ విజయవంతమైంది. ఆ ఏడాది జులై 20న వ్యోమగామి నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలు మోపి చరిత్ర సృష్టించాడు. అదొక్కటే కాదు.. అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో నాసా కీలక పాత్ర వహించింది. అలాగే, కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌, మిసైల్‌ డిటెక్షన్‌, నావిగేషన్‌, సర్వెలెన్స్‌ శాటిలైట్‌, వాతావరణం ఇలా అనేక అంశాలకు సంబంధించిన ప్రయోగాలను చేస్తోంది. నాసా కోసం అమెరికా గతేడాది 629 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. ఈ సంస్థలో 17,373 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.


ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌(ఇస్రో)

అంతరిక్ష పరిశోధనల అవసరాన్ని గుర్తించిన భారతీయ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ భారత ప్రభుత్వాన్ని ఒప్పించి 1962లో ‘ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ సంస్థ అటామిక్‌ ఎనర్జీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేది. ఆ తర్వాత దీన్నే ‘ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో)’గా మార్చారు. 1972లో అంతరిక్ష పరిశోధనలపై పర్యవేక్షణ కోసం అంతరిక్ష శాఖ(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ స్పేస్‌)ను ఏర్పాటు చేసి ఇస్రోను అందులో భాగం చేశారు. ఈ శాఖను ప్రధాన మంత్రే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. కాగా.. దేశీయంగా ఇస్రో తయారు చేసిన తొలి శాటిలైట్‌ ‘ఆర్యభట్ట’ను 1975లో సోవియట్‌ యూనియన్‌(అప్పటి ఉమ్మడి రష్యా)తో కలిసి ప్రయోగించారు. ఆ తర్వాత ఇస్రో వెనక్కి తిరిగి చూసుకోలేదు.. చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ వంటి మిషన్స్‌ చేపట్టింది. ఎన్నో శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించిన చరిత్ర ఇస్రో సొంతం. 2017లో పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌ ద్వారా 104 శాటిలైట్లను పంపించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇస్రోకు భారత ప్రభుత్వం 2బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ కేటాయించింది. ఇస్రోలో 17,099మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. 


నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ స్టడీస్‌ (సీఎన్‌ఈఎస్‌‌)

ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ స్టడీస్‌ ఏజెన్సీ ప్రస్తుతం డిఫెన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేలా.. పునర్వినియోగించేలా రాకెట్ల తయారీ వంటి అంశాలపై దృష్టి సారించింది. అంతకుముందు యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీ ద్వారా అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేది. 1961లో దీన్ని స్థాపించారు. ఫ్రాన్స్‌ రక్షణ శాఖ ఈ ఏజెన్సీని పర్యవేక్షిస్తుంటుంది. గతేడాది ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ ఏజెన్సీకి 2.78బిలియన్‌ యూరోల బడ్జెట్‌ కేటాయించింది.


జర్మన్‌ ఏరోస్పేస్‌ సెంటర్‌(డీఎల్‌ఆర్‌)

కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ విద్యుత్‌శక్తిని ఉత్పత్తి చేయడం, సోలార్‌ పవర్డ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యాలుగా జర్మన్‌ ఏరోస్పేస్‌ సెంటర్‌ పనిచేస్తోంది. 1969లో ఏర్పాటైన ఈ ఏజెన్సీని జర్మన్‌ ఫెడరల్‌ ప్రభుత్వం నియంత్రిస్తుంది. గెలిలియో, మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌, షటిల్‌ రాడార్‌ టోపోగ్రఫీ మిషన్‌ వంటి ప్రయోగాలను నిర్వహించింది. ఈ ఏజెన్సీకి జర్మనీ ప్రభుత్వం గతంలో భారీ నిధులు కేటాయించింది. ప్రస్తుతం ఈ ఏజెన్సీలో 8,127 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. 


యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)

1975లో ఏర్పాటైన యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ.. యూరప్‌ ఖండంలోని 22 దేశాల సంయుక్త సంస్థ. ప్రపంచంలోని ఇతర స్పేస్‌ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంటుంది. ముఖ్యంగా సౌరకుటుంబంలోని గ్రహాలు.. వాటి ఉపగ్రహాలపై పరిశోధనలు చేస్తోంది. 1997లో నాసా సహకారంతో క్యాసినీ మిషన్‌ను ప్రయోగించగా.. 2004లో అది శనిగ్రహం కక్ష్యలోకి చేరింది. ప్రస్తుతం ఈఎస్‌ఏ గురు, బుధ గ్రహాలపై పరిశోధన చేస్తోంది. పారిస్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఈఎస్ఏకి 2021లో యూరప్‌ దేశాలు 6.5బిలియన్‌ యూరోలు కేటాయించాయి.


ఇటాలియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(ఐఎస్‌ఏ)

ఇటాలియన్‌ స్పేస్‌ ఏజెన్సీ 1988లో ఏర్పాటైంది. 1996లో బెప్పోసాక్స్‌ పేరుతో శాటిలైట్‌ ప్రయోగం చేసింది. విశ్వాన్ని ఎక్స్‌-రే తీసి పరిశోధించడం కోసం ఈ ప్రయోగం చేశారు. మరోవైపు అంతరిక్ష కేంద్రానికి అవసరమైన వస్తువులను రాకెట్‌లో తీసుకెళ్లడం, తీసుకురావడం వంటి పనులను ఈ స్పేస్‌ ఏజెన్సీనే నిర్వహిస్తోంది.


రోస్కోస్మోస్‌

సోవియట్‌ యూనియన్‌ 1950ల్లో స్థాపించిన సోవియట్‌ స్పేస్‌ ప్రోగ్రాం కాలక్రమంలో రోస్కోస్మోస్‌ స్టేట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ స్పేస్‌ యాక్టివిటీస్‌గా మారింది. 1991లో సోవియట్‌ యూనియన్‌ విడిపోయిన తర్వాత 1992లో రష్యా స్పేస్‌ ఏజెన్సీగా ఏర్పడింది. అదే రష్యన్‌ ఏవియేషన్‌ అండ్‌ స్పేస్‌ ఏజెన్సీగా.. 2004లో ఫెడరల్‌ స్పేస్‌ ఏజెన్సీగా అవతరించింది. దీన్ని 2013లో రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యునైటెడ్‌ రాకెట్‌ అండ్‌ స్పేస్‌ కార్పొరేషన్‌లో కలిపేశారు. ప్రస్తుతం ఇది అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తోంది. ఆ గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకునేందుకు ఆన్వేషణ చేపట్టింది. ఇది ఎక్కువగా నాసా, ఇస్రో, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంటుంది. ఈ ఏజెన్సీకి గతేడాది 2.77బిలియన్‌ డాలర్లు కేటాయించారు.


చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీఎన్‌ఎస్‌ఏ)

చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ ఏజెన్సీ ప్రపంచంలో ఇతర ఏ దేశాలతోనూ కలిసి పనిచేయదు. అంతెందుకు.. పలు దేశాలు కలిసి నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చైనా భాగస్వామి కాలేదు. దానికంటూ ప్రత్యేకంగా చిన్న అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుంది. 2003లో 11 మంది వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపించింది. ఇటీవల చంద్రుడిపైకి రాకెట్‌ను పంపి అక్కడి నమూనాలను భూమికి తీసుకొచ్చి సంచలనం సృష్టించింది. 2018లో చైనా ప్రభుత్వం ఈ ఏజెన్సీకి 11బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయించింది.


జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా)

జపాన్‌లో గతంలో అంతరిక్ష పరిశోధన కోసం నేషనల్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఆఫ్‌ జపాన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ అండ్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్స్‌, నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీ ఆఫ్‌ జపాన్‌ సంస్థలు ఉండేవి. ఆ మూడింటిని కలిపి 2003లో జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ఏర్పాటు చేశారు. ఉల్కలు, చంద్రుడిపై జాక్సా పరిశోధన చేస్తోంది. ఇతర దేశాలకు అధునాతన శాటిలైట్లను తయారు చేస్తుంటుంది. అలాగే, సోనీ సంస్థతో కలిసి లేజర్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థపై అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది జాక్సాకు జపాన్‌ ప్రభుత్వం 2 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. 


స్పేస్‌ ఎక్స్‌

పైవన్నీ ఆయా దేశాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన స్పేస్‌ ఏజెన్సీలు కాగా.. స్పేస్ ఎక్స్‌ను ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్‌ మస్క్‌ ప్రైవేటుగా ఏర్పాటు చేశారు. భూకక్ష్యలో శాటిలైట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు స్పేస్‌ ఏజెన్సీగా స్పేస్‌ ఎక్స్‌ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. భూమి - అంతరిక్ష కేంద్రం ప్రయాణానికి పునర్వినియోగించే రాకెట్లను తయారు చేసింది. ప్రస్తుతం స్పేస్‌ ఎక్స్‌ అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. 2026 నాటికి అంగారక గ్రహంపైకి మనుషుల్ని పంపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు