Published : 21 Jan 2021 03:52 IST

అధ్యక్షుడు ఒక పార్టీ.. ఉపాధ్యక్షుడు మరో పార్టీ!

1796 అమెరికా ఎన్నికల్లో విచిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా.. అధికారంలో ఉండే నేతలంతా ఒకే పార్టీకి చెందినవారై ఉంటారు. దేశాధ్యక్ష పదవి నుంచి అన్ని పదవులు గెలిచిన పార్టీ నేతలకే ఇచ్చుకుంటారు.. లేదా మద్దతుగా నిలిచిన మిత్రపక్ష పార్టీకి చెందిన నేతలు కొందరికి పదవులు ఇస్తుండొచ్చు. కానీ, ఓసారి పరస్పర విరుద్ధ సిద్ధాంతాలతో ఏర్పడిన రెండు పార్టీలు ఎన్నికలో హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఆఖరికి ఒక పార్టీ అధ్యక్ష పదవిని.. మరో పార్టీ ఉపాధ్యక్ష పదవిని గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వింతగా ఉంది కదా..! ఈ ఘటన ఎక్కడో కాదు.. అమెరికాలోనే.‌ ఆ దేశంలో పార్టీలు ఏర్పడిన కొత్తలో అధ్యక్షుడిని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానం తెలియక జరిగిన విచిత్రమిది.

జార్జ్‌ వాషింగ్టన్‌ ఏకగ్రీవంగా అమెరికా అధ్యక్షుడై 1789 నుంచి 1797 వరకు ప్రజలకు సేవ చేసిన విషయం తెలిసిందే. నామమాత్రపు ఎన్నికలు నిర్వహించి ఎలక్టర్లంతా వాషింగ్టన్‌నే అధ్యక్షుడిని చేశారు. అదే సమయంలో ఆయనతోపాటే ఉన్న కొందరు నేతల మధ్య సిద్ధాంతాల పరంగా విభేదాలొచ్చాయి. దీంతో అలెగ్జాండర్‌ హమిల్టన్‌ ‘ఫెడరలిస్ట్‌’ పార్టీ స్థాపించగా.. థామస్‌ జెప్ఫర్సన్‌ ‘డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌’ పార్టీ ప్రారంభించారు. 1796లో అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి. మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టడానికి వాషింగ్టన్‌ ఆసక్తి చూపలేదు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫెడరలిస్ట్‌, డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌ పార్టీలు అధ్యక్ష పదవి కోసం పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.

అనుకున్నది ఒకటి.. అయ్యిందొకటి

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రాజ్యాంగంలో పార్టీలవారీగా ఎన్నికలు నిర్వహించే విధానాన్ని ఎక్కడా పేర్కొనలేదు. అప్పటి నిబంధనల ప్రకారం.. అధ్యక్ష బరిలో ఎవరైనా నిలబడొచ్చు. అయితే ఎలక్టోరల్ కాలేజ్‌ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు అధ్యక్షుడు.. రెండో స్థానంలో ఉన్నవారు ఉపాధ్యక్షుడు అవుతారు. ఈ విషయాన్ని సరిగా గ్రహించలేకపోయినా నేతలు పోటీకి సిద్ధమయ్యారు. అప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న జాన్‌ ఆడమ్స్‌కు అధ్యక్ష పదవి, థామస్‌ పింక్‌నే అనే మరో నేతకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించుకొని ఫెడరలిస్టు పార్టీ నామినేషన్‌ దాఖలు చేసింది.

మరోవైపు డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌ పార్టీ కూడా గెలిస్తే థామస్‌ జెప్ఫర్సన్‌కు అధ్యక్ష పదవి, ఆరోన్‌ బర్‌కు ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని భావించి పోటీకి దిగింది. రెండు పదవులు తమకే కావాలని పార్టీలు కోరుకున్నా.. ఎన్నికల నిబంధనల దృష్ట్యా అభ్యర్థులు ఒంటరిగానే పోటీ చేయాల్సి వచ్చింది. ఈ గందరగోళ రాజకీయాన్ని చూసి ప్రజలు పెద్దగా పోలింగ్‌లో పాల్గొనలేదు. అయినా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన ఎలక్టర్లు అధ్యక్ష బరిలో నిలబడ్డవారిని ఎంచుకోవాలి. అప్పట్లో ఎలక్టర్లకు రెండేసి ఓట్లు వేసే అవకాశం ఉండేది. ఎన్నికలు నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 7 వరకు కొనసాగాయి. ఫలితాలు మాత్రం విచిత్రంగా వచ్చాయి.

ఫెడరలిస్ట్‌ పార్టీ తరఫున పోటీ చేసిన జాన్‌ ఆడమ్స్‌ మొత్తం 71 ఓట్లు సాధించి అధ్యక్ష పదవికి అర్హత సాధించారు. ఇక డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన థామస్‌ జెప్ఫర్సన్‌ 68 ఓట్లతో రెండోస్థానం దక్కించుకొని ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అమెరికా చరిత్రలో ఇదో రికార్డు. ఆ తర్వాత 1800లో జరిగిన ఎన్నికల్లో ఎలక్టర్లు కాస్త అప్రమత్తంగా ఉండి ఓట్లు వేయడంతో డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌ పార్టీ తరఫు అభ్యర్థులు థామస్‌ జెప్ఫర్సన్‌, ఆరోన్‌ బర్.. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టారు.

మార్పు ఎలా..?

అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడంలో ఇబ్బందులు గుర్తించిన డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించింది. అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని వేర్వేరుగా ఎంచుకునే విధంగా పాలకులు 1804 జూన్‌లో రాజ్యాంగ సవరణ చేశారు. అదే ఏడాది నిర్వహించిన ఎన్నికల్లోనే ఈ 12వ రాజ్యాంగ సవరణను అమలు చేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని