Ramoji Rao: సినీ, మీడియా రంగం టైటాన్‌ను కోల్పోయింది: రామోజీ మృతి పట్ల రాజకీయ ప్రముఖుల నివాళి

Ramoji Rao: రామోజీరావు మరణంతో మీడియా, వినోద రంగం ఓ టైటాన్‌ను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.

Updated : 09 Jun 2024 03:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావుతో తమకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు. మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

దూరదృష్టితో సమాజంలో రామోజీ చెరగని ముద్ర: రాష్ట్రపతి

‘‘రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ టైటాన్‌ను కోల్పోయింది. ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచిన సృజనాత్మక వ్యాపారవేత్త ఆయన. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారు. పద్మవిభూషణ్‌ సత్కారం అందుకున్నారు. మీడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’’ - రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు: మోదీ

‘‘రామోజీ రావు మరణం ఎంతో బాధాకరం. భారతీయ మీడియాలో విప్లవాత్మక వార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు ఆయన. ఆయన సేవలు సినీ, పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషి ద్వారా.. మీడియా, వినోద ప్రపంచాల్లో శ్రేష్ఠమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. ఆయనతో సంభాషించేందుకు, ఆయన నుంచి అపారమైన జ్ఞానాన్ని పొందేందుకు అవకాశం రావడం నా అదృష్టం. ఈ విచారకర సమయంలో రామోజీ కుటుంబసభ్యులు, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - ప్రధాని నరేంద్ర మోదీ

రామోజీ రావు తెలుగు వెలుగు: చంద్రబాబు

‘‘సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించా.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. తెలుగు వెలుగు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికే తీరని లోటు’’ - తెదేపా అధినేత చంద్రబాబు

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్ రెడ్డి

‘‘తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన వ్యక్తి రామోజీరావు. మీడియా రంగానికి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా’’ - తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

రామోజీ అంటేనే క్రమశిక్షణ: వెంకయ్యనాయుడు

‘‘ఆత్మీయుడు రామోజీ మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఆయన సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయం. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. ఆయన ఓ వ్యక్తి కాదు.. శక్తిమంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం నుంచి యువతరం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఆయన లేని లోటు పూడ్చలేనిది’’ - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ‘‘భారత మీడియా రంగంలో అగ్రగామి, పద్మవిభూషణ్‌ రామోజీరావు మరణం విచారకరం. జర్నలిజం, సినిమా, వినోద రంగానికి ఆయన అందించిన సేవలు చెరగని ముద్ర వేశాయి. మీడియా రూపురేఖలను మార్చాయి. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ
  • ‘‘మీడియా లీడర్‌ రామోజీరావు మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. కమ్యూనికేషన్‌ ప్రపంచానికి ముఖ్యంగా తెలుగు మీడియాకు ఆయన దార్శనికుడు. వ్యక్తిగతంగానూ ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది. ఓసారి నన్ను తన స్టూడియోకు ఆహ్వానించారు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ
  • ‘‘పద్మవిభూషణ్‌ రామోజీరావు మరణం తీవ్ర విచారకరం. మీడియా, జర్నలిజం, సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా’’ - తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌
  • ‘‘మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు మరణం విచారకరం. మీడియా నుంచి ఫైనాన్స్‌ వరకు.. విద్య నుంచి పర్యాటకం వరకు తాను పనిచేసిన అనేక రంగాల్లో తన సృజనాత్మకతతో ఎన్నో సానుకూల ప్రమాణాలను తీసుకొచ్చారు. ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా - అమిత్ షా
  • ‘‘ఉత్సుకత, దూరదృష్టి, సంకల్పంతో ప్రవేశించిన ప్రతి రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారు. ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. కేరళలో ప్రకృతి విపత్తులు ఎదురైన సమయంలో మా రాష్ట్రానికి అండగా నిలిచారు. ఆయన మరణం యావత్‌ దేశానికి తీరని లోటు’’ - కేరళ సీఎం పినరయి విజయన్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని