నీటిగుంటకు ఇన్‌స్టా ఖాతా.. దానికుందో పెద్ద కథ!

రష్యాలోని యుజ్నో-సఖాలిస్క్‌ అనే నగరంలో ఓ రోడ్డులో నీటిగుంట ఉంది. దీన్ని చూడటానికి ఏటా వేలమంది సందర్శకులు వస్తున్నారు. ఆ గుంటతో ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. నీటి గుంటను సందర్శించడం ఏంటి? దాంతో ఫొటోలు దిగడమేంటని

Updated : 15 Jan 2021 12:58 IST


(ఫొటో: యా లుజా యూ డోమా ఇన్‌స్టా)

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యాలోని యుజ్నో-సఖాలిస్క్‌ అనే నగరంలో ఓ రోడ్డులో నీటిగుంట ఉంది. దీన్ని చూడటానికి ఏటా వేలమంది సందర్శకులు వస్తున్నారు. అక్కడ ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. నీటి గుంటను సందర్శించడం ఏంటి? దాంతో ఫొటోలు దిగడమేంటని ఆశ్చర్యపోతున్నారా?నిజమేనండీ.. ఆ నీటిగుంట స్థానికంగా చాలా ఫేమస్‌. ఎంతలా అంటే.. దానికంటూ ప్రత్యేకంగా ఇన్‌స్టా ఖాతా.. వేలకొద్ది ఫాలోవర్స్‌ ఉన్నారు మరి.

నీటి గుంట ఇంత ఫేమస్‌ అవడం వెనుక పెద్ద కథే ఉంది. 1994లో ఈ రోడ్డుకు పెద్ద గుంత పడింది. దీంతో వర్షాకాలంలో నీరంతా ఆ గుంతల్లో వచ్చి చేరి నీటి గుంటగా మారింది. దీని కారణంగా స్థానికులు, ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ సమస్యను అక్కడి ప్రజలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డును బాగు చేయాలని కోరారు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన వచ్చేది కాదు. అలా ఏటా రోడ్డు మరమ్మతుల గురించి స్థానిక ప్రభుత్వానికి ప్రజలు అర్జీ పెట్టుకోవడం.. అధికారులు పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిపోయింది.

అలా రెండున్నర దశాబ్దాలుగా ఆ రోడ్డులో నీటిగుంట అలాగే ఉంటోంది. ఆ నీటి గుంటలో నడుస్తూనే స్థానికులు వారి వారి పనులు చక్కబెట్టుకుంటున్నారు. 2014లోనూ ఒకసారి ప్రజలు ఈ సమస్య గురించి ప్రభుత్వానికి వివరించగా.. ఇదిగో చేస్తాం.. అదిగో చేస్తామని 2017 వరకు నెట్టుకొచ్చారు. ఆ తర్వాత 2024లో ఈ ప్రాంతంలో కొత్త రోడ్డు వేస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నారు.

ఇన్‌స్టాలో ఎంట్రీ..

నీటిగుంట విషయంలో అధికారుల తీరుపై విసుగెత్తిన నికోలే అనే కుర్రాడు.. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 2019లో నీటిగుంటకు ప్రత్యేకంగా ‘యా లుజా యూ డోమా’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. ‘నేను నీటిగుంటను. 25 ఏళ్లుగా నన్ను ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు జోడించాడు. నీటి గుంటకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో పోస్టు చేస్తున్నాడు. దీంతో కొద్ది కాలంలోనే ఈ నీటిగుంట ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో నీటిగుంటకు తాత్కాలికంగా మరమ్మతులు చేసి పూడ్చారు. అయితే, వర్షాకాలంలో మళ్లీ గుంతలు పడగా.. మళ్లీ తాత్కాలిక మరమ్మతులే చేసి వదిలేశారు. కొత్త రోడ్డు మాత్రం 2024లోనే వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందట. ఈ వివరాలను నికోలే ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ.. ఫొటోలు వైరల్‌ అయ్యేలా చేయడంతో రష్యా వ్యాప్తంగా ఈ నీటిగుంట గురించి అందరికీ తెలిసిపోయింది. దీంతో కొందరు రాజకీయ నాయకులు, ప్రముఖులు, యూట్యూబర్లు ఈ ప్రాంతానికి వచ్చి నీటిగుంట సమీపంలో ఫొటోలు దిగుతున్నారు. మరికొందరైతే ఏకంగా సర్ఫింగ్‌ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇకనైనా స్పందించి త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తుందో లేదో చూడాలి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని