Pulivarthi nani: పులివర్తి నానిపై హత్యాయత్నం .. విచారణ వేగవంతం చేసిన పోలీసులు

తిరుపతి ఎస్వీ మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం చేశారు.

Updated : 23 May 2024 21:24 IST

తిరుపతి: తిరుపతి ఎస్వీ మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం చేశారు. నానిని ఎస్‌వీయూ క్యాంపస్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి.. తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ మురళీ మోహన్‌ వివరాలు సేకరించారు. పోలింగ్‌ జరిగిన మరుసటి రోజు (ఈనెల 14)న మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు భద్రపరిచిన  స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించేందుకు నాని వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో వైకాపా శ్రేణులు ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందిన ఆయన ఇటీవల డిశ్చార్జి అయ్యారు. ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరికొంత మంది దాడికి పాల్పడిన వారిలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో నాని ప్రత్యక్షంగా చూసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

సూత్రధారులు.. పాత్రధారులను పోలీసులు వదిలేశారు..

విచారణ ముగిసిన అనంతరం నాని మీడియాతో మాట్లాడారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, వీడియో ఫుటేజీలన డీఎస్పీకి అందజేసినట్టు చెప్పారు. ఈ కేసులో అసలు నిందితులను వదిలేసి అమాయకులను ఇరికించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. అరెస్టయిన వారిలో నలుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, రఘు, భానుకుమార్‌రెడ్డి తనను చంపాలని చూశారని ఆరోపించారు. అసలు పాత్రధారులు, సూత్రధారులను పోలీసులు వదిలేశారని పేర్కొన్నారు. 70 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, హత్యాయత్నానికి పాల్పడిన వైకాపా కార్యకర్తలను వదిలేశారన్నారు. ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి పోలీసులు మరింత భద్రత కల్పించాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి రీపోలింగ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కౌంటింగ్‌ సరిగా నిర్వహించేలా అధికారులు చూడాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని