Telangana Rains: తెలంగాణ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Updated : 23 May 2024 15:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈశాన్య దిక్కులో కదులుతోంది. గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి అనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలో స్పష్టమైన అల్ప పీడన ప్రాంతంగా కొనసాగుతోంది. అది ఈశాన్య దిశలో కదిలి ఈనెల 24న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 

వాయుగుండం ఈశాన్య దిక్కులోనే కదులుతూ మరింత బలపడి ఈనెల 25న ఉదయం తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా మారనుంది. అనంతరం ఉత్తర దిక్కులోనే కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకొనే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతం, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రాగల రెండు రోజుల్లో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో కింద స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని