రామోజీరావు అస్తమయం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు.

Updated : 08 Jun 2024 13:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.

1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీకి.. తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి.. తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది.

కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం..

బహుముఖ ప్రజ్ఞ.. కఠోర సాధన.. ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు.. చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకూ ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు.

వేల మందికి ఉద్యోగ, ఉపాధి..

అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్స్‌ సంస్థగా మార్గదర్శి నిలిచింది . 60 ఏళ్లలో లక్షలాదిమంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని