కమలా హారిస్‌ ముత్యాల హారం వెనుక రహస్యం!

భారతీయ మూలాలు ఉన్న ఓ మహిళ అగ్రరాజ్యం అమెరికాకు ఉపాధ్యక్ష పదవి చేపట్టడం గొప్ప విషయం. ఇప్పటి వరకు ఏ మహిళ సాధించని విజయం అది. అందుకే మహిళాలోకమంతా ఇప్పుడు కమలకు జేజేలు కొడుతోంది. తన ప్రసంగాలతో అమెరికా ప్రజలనే కాదు.. భారతీయుల

Published : 22 Jan 2021 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ మూలాలు ఉన్న ఓ మహిళ అగ్రరాజ్యం అమెరికాకు ఉపాధ్యక్ష పదవి చేపట్టడం గొప్ప విషయం. ఇప్పటి వరకు ఏ మహిళ సాధించని విజయం అది. అందుకే మహిళాలోకమంతా ఇప్పుడు కమలకు జేజేలు కొడుతోంది. తన ప్రసంగాలతో అమెరికా ప్రజలనే కాదు.. భారతీయుల మనసు గెలుచుకున్న కమలను ఎప్పుడైనా సరిగా గమనించారా?ముఖ్యమైన సమావేశాలకు, కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఆమె మెడలో ముత్యాల హారం కనిపిస్తుంటుంది. అయితే, వాటిని కమలా కేవలం అలంకారప్రాయంగా ధరించట్లేదు.. దాని వెనుక ఓ కారణముంది.

తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా కమలా హారిస్‌ ముత్యాలహారం ధరించారు. ‘అల్ఫా కప్పా అల్ఫా(ఏకేఏ) సొసైటీ’ గౌరవార్థం ఆమె వాటిని ధరిస్తుంటారట. కమలా 1986లో హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ సమయంలో యూనివర్సిటీలో ఉన్న ‘అల్ఫా కప్పా అల్ఫా’ సొసైటీలో సభ్యురాలిగా చేరారు. ఈ సోసైటీ కళాశాలల్లో విద్యార్థినుల మధ్య స్నేహభావం పెంచడం, సమాజంలో యువతులను ఉన్నతస్థాయికి ఎదిగేలా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ సొసైటీ పనిచేస్తోంది.

ఈ సొసైటీని 1908లో తొమ్మిది మంది విద్యార్థినులు కలిసి స్థాపించారు. మొత్తం ఇరవై మంది భాగమయ్యారు. దీంతో ‘ఏకేఏ’ వ్యవస్థాపకులను ‘ట్వెంటీ పెరల్స్‌’గా పిలుస్తుంటారు. అందుకే ఈ సొసైటీలో చేరే ప్రతి సభ్యురాలికి ముత్యాలతో కూడిన బ్యాడ్జి ఇస్తారట. అలా ఆ సొసైటీలో సభ్యురాలైన కమలా.. ఏకేఏ గౌరవార్థం తన జీవితంలో ముఖ్యమైన ప్రతి సందర్భంలో ముత్యాలను భాగం చేశారు. ప్రత్యేక కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఎక్కువగా రెండు వరుసలు లేదా ఒక్క వరుస ఉన్న ముత్యాల హారం, నలుపు రంగులో ఉండే పెద్ద ముత్యాల హారాన్ని ధరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ కమలా ఒక్క వరస ముత్యాల హారం ధరించారు. ఈ సందర్భంగా ‘ఏకేఏ’ ప్రస్తుత అధ్యక్షురాలు గ్లెండా గ్లోవర్‌ మాట్లాడుతూ.. ముత్యాలు స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. తమ సంస్థ ద్వారా యువతులను భవిష్యత్తు తరాల నేతలుగా తీర్చిదిద్దేందుకు ఈ సొసైటీ నిరంతరం పనిచేస్తుందని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు