Nimmagadda: నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.. గవర్నర్‌కు నిమ్మగడ్డ వినతి

ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఫోరం ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, తదితరులు బుధవారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Published : 06 Dec 2023 18:32 IST

విజయవాడ: ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఫోరం ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, తదితరులు బుధవారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రమేశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.

‘‘ప్రభుత్వం, పార్టీ.. రెండూ సమాంతర వ్యవస్థలు. ప్రభుత్వంపై పార్టీ ప్రభావం పడకూడదు. ప్రభుత్వ వనరులతో, ప్రభుత్వ సిబ్బందితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అనైతికం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇటీవల జారీ చేసిన జీవో నెం.7 ద్వారా పబ్లిక్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రామ్‌ పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కలిపే నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. అందుకే ఆయన్ను కలిసి రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చూడాలని ఫిర్యాదు చేశాం. పారదర్శకమైన పాలన జరగాలని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆశిస్తోంది.

రెండు ఓట్లు కలిగి ఉండటం అనైతికం..

దేశంలో చాలా మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఒకే వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండటం అనైతికం. ఓటు తొలగించేటప్పుడు సంబంధిత వ్యక్తికి నోటీసు ఇచ్చి.. వివరణ తీసుకోవాలి. పౌరుడు ఎన్నిక చేసుకున్న ప్రదేశంలోనే ఓటు హక్కు కల్పించాలి. నివాసం లేనంత మాత్రాన ఓటు హక్కు తొలగించకూడదు. కేవలం బీఎల్వోల ఫిర్యాదు మేరకు ఓటు హక్కు తొలగిస్తున్నారు’’ అని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని