Vijayawada: సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి

అజిత్‌సింగ్‌ నగర్‌ వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. 

Updated : 17 Apr 2024 17:29 IST

విజయవాడ: అజిత్‌సింగ్‌ నగర్‌ వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో.. వడ్డెర బస్తీకి చెందిన దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారని వారంతా నిరసనకు దిగారు. స్టేషన్‌కు వెళ్లి విచారించగా దుర్గారావు అక్కడ కూడా లేడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ‘రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలం. సీఎం జగన్‌పై రాళ్లు వేసేంతటి వాళ్లామా మేము. నిన్న సాయంత్రం నుంచి పిల్లలు అన్నం తినకుండా ఏడుస్తున్నారు. దుర్గారావును తీసుకెళ్లింది పోలీసులేనా? అనే అనుమానం కలుగుతోంది’’ అని దుర్గారావు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రాయి దాడి కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. విజయవాడ సీపీ కార్యాలయం వద్ద కూడా వడ్డెర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల్ని చూపించాలని కాసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కేసుతో సంబంధం లేకున్నా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఇలాంటి డ్రామాలు అలవాటే: న్యాయవాది సలీం

రాయిదాడి కేసులో వడ్డెర యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై న్యాయవాది అబ్దుల్‌ సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రాత్రి నుంచి తమ పిల్లల కోసం వేచి చూస్తున్న బాధిత కుటుంబ సభ్యులను న్యాయవాది కలిశారు. బాధితులకు న్యాయం చేసేందుకు వారి తరఫున వకాల్తా తీసుకున్నానని, సెర్చ్‌ వారెంట్‌ వేయనున్నట్టు సలీం ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి డ్రామాలు జగన్‌కు అలవాటేనని, కుట్రలను న్యాయస్థానంలో తిప్పికొట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్టు చెప్పారు.

బాలల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు..

మంగళవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే ఐదుగురిని పట్టుకెళ్లారు. విచారించి ఇప్పుడే పంపుతామంటూ ఇప్పటి వరకూ వారి ఆచూకీ చెప్పలేదు. దీంతో బాలల తల్లిదండ్రులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. వారి రోదనలు మిన్నంటుతున్నాయి. అభంశుభం తెలియని పిల్లలను తీసుకెళ్లి వేధిస్తున్నారని వాపోతున్నారు. సీఎం జగన్‌ వస్తున్నప్పుడు వైకాపా జెండా పట్టుకుంటే రూ.200 ఇస్తామన్న మాయమాటలే తమను ఇంతలా మనోవ్యథకు గురిచేశాయని రోదిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని