Secunderabad-Tirupati: మరిన్ని హంగులతో వందేభారత్.. తగ్గిన ప్రయాణ సమయం

సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 16 బోగీలతో మొదటి ట్రిప్‌ బుధవారం నుంచి ప్రారంభమైంది.

Updated : 17 May 2023 20:12 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 16 బోగీలతో మొదటి ట్రిప్‌ బుధవారం నుంచి ప్రారంభమైంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ నుంచి 109శాతం ప్రయాణికులతో బయలుదేరినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. గతంలో కంటే 15 నిమిషాల తక్కువ సమయంలో రైలు గమ్యస్థానానికి చేరుకున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్‌-తిరుపతి-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన నాటి నుంచి ప్రయాణికుల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. ఈ రైలు రెండు వైపులా 130శాతం కంటే ఎక్కువ ఓఆర్‌తో నడిచిందని రైల్వేశాఖ వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే రైలులోని కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 16కి రెట్టింపు చేసింది.

దీంతో రైలు సీటింగ్‌ సామర్థ్యం 530 నుంచి 1,128 సీట్లకు పెంచింది. ప్రస్తుతం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో 104 సీట్లు, ఛైర్‌ కార్‌లో మరో 1,024 సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ ఇవాళ్టి మొదటి ట్రిప్‌లో 1,228 మంది ప్రయాణికులు ఈ రైలు ప్రారంభానికి ముందే బుకింగ్‌ చేసుకున్నారు. వందేభారత్‌ రైలు ప్రయాణీకుల సౌకర్యాన్ని మరింత పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా బుధవారం నుంచి రెండు వైపులా ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలు తగ్గించింది. ఫలితంగా రెండు దిశల్లో ప్రయాణం ఇప్పుడు 8.30గంటల వ్యవధికి బదులు 8.15 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడానికి ఈ నిర్ణయం మరింత దోహద పడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. వందే భారత్ రైలులో జీపీఎస్‌ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్‌ఈడీ లైటింగ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని