AP News: నరసరావుపేటలో ‘సిట్‌’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా

స్థానిక ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో సిట్‌ బృందం దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు.

Updated : 19 May 2024 11:25 IST

నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో సిట్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు. పోలింగ్‌ రోజు, తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ జరిపింది. సిట్‌ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో విచారణ చేశారు. 

ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు.

పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కార్డన్‌ సెర్చ్‌ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. 

తిరుపతిలో సిట్‌ బృందం విచారణ

తిరుపతిలో సిట్‌ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్వీయూ క్యాంపస్‌ పోలీసు స్టేషన్‌లో కేసులను పరిశీలించారు. అల్లర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్‌ వివరాలను అధికారులు పరిశీలించారు. సిట్‌ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక అందజేయనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని