Nirmala Sitharaman: ఏపీ సహా ఆరు రాష్ట్రాలు అదనపు రుణాలు పొందేందుకు అవకాశం

విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు గాను అదనంగా 0.5శాతం రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవకాశం కల్పించింది.

Updated : 19 Dec 2023 19:06 IST

దిల్లీ: విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు గాను అదనంగా 0.5శాతం రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. విద్యుత్‌ సంస్కరణల్లో ప్రధానంగా 3 అంశాలను అమల్లోకి తీసుకువచ్చినందుకుగాను కేంద్ర ఈ అవకాశం కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12 రాష్ట్రాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ సహా ఆరు రాష్ట్రాలకు అవకాశం దక్కింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మార్కెట్‌ నుంచి అదనపు రుణాలు పొందేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.

ఈ వెసులుబాటు ద్వారా 2021-22లో ఏపీ ప్రభుత్వం రూ.3,716 కోట్లు రుణం తీసుకుంది. తాజాగా కల్పించిన వెసులుబాటుతో రూ.5,858 కోట్ల రుణం తీసుకునేందుకు అవకాశం లభించింది. ఏపీతో పాటు అస్సాం, కేరళ, రాజస్థాన్‌, సిక్కిం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సామాజిక మాధ్యమం (ఎక్స్‌) ద్వారా వివరాలు వెల్లడించారు. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ సిఫారసుతో రాష్ట్రాలు మార్కెట్‌ నుంచి అదనపు రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని