Supreme Court: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Updated : 08 Dec 2023 16:00 IST

దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. స్కిల్‌ కేసులో (Skill case) చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై గతంలో వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఇవాళ జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది.

స్కిల్‌ కేసుకు సంబంధించి 17ఏ వ్యవహారంపై ఇప్పటికీ తీర్పు వెలువరించలేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే కోరారు. వాయిదా వేయకుంటే విచారణ తేదీని చెప్పాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే, నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్‌ దాఖలు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని హరీష్‌ సాల్వే తెలిపారు. అదే సమయంలో ఈ అంశం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని హరీష్‌ సాల్వే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సాల్వే వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. అయితే, తేదీ ఖరారు చేయాలని హరీశ్‌ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. సాల్వే విజ్ఞప్తితో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 19కి వాయిదా వేసింది. జనవరి 19లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఆ కౌంటర్‌కు రిజాయిండర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు