గల్వాన్‌‌ లోయలో సైనికులకు సోలార్‌ టెంట్లు

భారత్‌.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్‌ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్‌లోయలో భారత సైన్యం అహర్నిశలు పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే

Published : 23 Feb 2021 00:59 IST

రూపొందించిన ‘త్రీ ఇడియట్స్‌’ స్ఫూర్తిప్రదాత

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్ లోయలో భారత సైన్యం పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే కాదు.. అక్కడి వాతావరణంతోనూ సైనికులు నిత్యం పోరాటం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో శీతాకాలం మైనస్‌ 20 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత ఉంటుంది. అయినా గడ్డకట్టే చలిలో సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారి కోసం వెచ్చటి టెంట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటికంటే అత్యాధునిక సోలార్‌ టెంట్లను సైనికుల కోసం రూపొందించారు సోనమ్‌ వాంగ్‌చుక్‌.

సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఎవరో కాదు.. త్రీ ఇడియట్స్‌ చిత్రంలో ఆమిర్‌ ఖాన్ పోషించిన ఫున్సుక్‌ వాంగ్‌డు పాత్ర ఆయనదే. ఎన్నో వస్తువులను కనిపెట్టి పేటెంట్‌ పొందారు. భారతదేశం గర్వించదగ్గ ఇంజినీర్‌.. శాస్త్రవేత్త. తాజాగా ఆయన గల్వాన్ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం సోలార్‌ టెంట్లను రూపొందించారు. బయట ఉష్ణోగ్రత ఎంత మైనస్‌ డిగ్రీల్లో ఉన్నా.. ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని సోనమ్‌ వెల్లడించారు. ఒక్కో టెంట్లో పది మంది సైనికులు ఉండొచ్చు. ఒక్క టెంట్‌ బరువు 30 కిలోల కన్నా తక్కువే ఉంటుందట. దీన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా తయారు చేశారు. ఈ టెంట్లలో ఉంటే సైనికులు బయట చలిమంట కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే కిరోసిన్‌ వాడరు.. కాలుష్యం వెలువడదు అని సోనమ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను తయారు చేసిన ఈ టెంట్ల ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. మేడ్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ లద్దాఖ్‌, కార్బన్‌ న్యూట్రల్‌ హ్యాష్‌ ట్యాగ్‌లు ఇచ్చారు. సోనమ్‌ ఆవిష్కరణ చూసిన నెటిజన్లు ‘జహాపనా తుసీ గ్రేట్‌ హో’అంటూ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. సైనికుల చలి సమస్యకు మంచి పరిష్కారం కనిపెట్టారని అభినందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని