Revanth Reddy: గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు: రేవంత్‌రెడ్డి

గల్ఫ్‌ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 16 Apr 2024 16:25 IST

హైదరాబాద్‌: గల్ఫ్‌ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని, వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండాలన్నారు. గల్ఫ్‌ కార్మిక సంఘాల నేతలతో హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్‌ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ గల్ఫ్‌, ఓవర్సీస్‌ వర్కర్స్‌ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించామన్నారు.

‘‘గల్ఫ్‌ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తాం. సీనియర్‌ ఐఏఎస్‌ నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తాం. ఉపాధి కోసం వెళ్లిన వారి వేతనాలు, బాగోగులు కూడా చూసుకోవాలి. కొన్ని దేశాలు, రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఓవర్సీస్‌ కార్మికుల కోసం పిలిప్పీన్స్‌, కేరళలో మంచి విధానం అమల్లో ఉంది. అన్నీ అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొందిస్తుంది. గల్ఫ్‌ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే నిర్ణయించాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని