Sunderlal Bahuguna: ఒక పర్యావరణ శక్తి

అది ప్రకృతి సౌందర్యానికి నెలవైన గర్వాల్ . అందమైన హిమాలయ సానువులు. ఆ హిమగిరులపై శాంతి దూతల్లా కొలవుతీరిన పైన్ వృక్షాలు. లేలేత ఎండ, రివ్వున వీచే శీతల గాలులు.

Published : 21 May 2021 18:07 IST

దిల్లీ: అది ప్రకృతి సౌందర్యానికి నెలవైన గర్వాల్ . అందమైన హిమాలయ సానువులు. ఆ హిమగిరులపై శాంతి దూతల్లా కొలవుతీరిన పైన్ వృక్షాలు. లేలేత ఎండ, రివ్వున వీచే శీతల గాలులు. ఆకుపచ్చ తివాచీ కప్పినట్లు భాసించే శిఖరాలు. ఆహ్లాదభరితమైన వాతావరణం. ఇది ప్రకృతికి ఒక పార్శ్వం. అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ దృశ్యాలను మరో కోణంలో నుంచి వీక్షిస్తే మహావృక్షాలను తెగ నరుకుతూ అడవులకు చితిపేరుస్తున్న ఫారెస్ట్ కాంట్రాక్టర్లు. రిజర్వ్‌ ఫారెస్ట్ లక్ష్మణ రేఖలతో పేదల కడుపుకొడుతున్న అధికారులు, భూకంపాల జోన్లు, భారీ డ్యామ్‌లు నిర్మిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలకులు.. ఎటుచూసినా విషాద దృశ్యాలు. దయనీయ జీవన చిత్రాలు. ఈ పోకడలను నిరసించి, గొంతెత్తి గర్జించి, ప్రజలను కదిలించిన పర్యావరణ ఉద్యమనీతి సుందర్‌లాల్ బహుగుణ.

పర్యావరణ ఉద్యమనేత సుందర్ లాల్‌ ఉత్తరాంచల్‌లోని తేహ్రీ గర్వాల్లోని మరోరాలో 1927, జనవరి 9న  జన్మించారు. తల్లి పూర్ణాదేవి. తండ్రి అంబదత్‌ బహుగుణ. 1956లో విమలను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. నిరాడంబరత, క్రమశిక్షణ ఆయన నమ్మిన జీవన సూత్రాలు. తండ్రి అంబదత్ తేహ్రీ గర్వాల్ రాజాస్థానంలో ఉద్యోగి.  దాంతో సుందర్ లాల్ విద్యాభ్యాసం సమీప పట్టణాలైన ఉత్తర కాశీ, తేహ్రీలలో కొనసాగింది. అక్కడే స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీదేవ్‌ సుమన్‌తో ఏర్పడిన పరిచయం సుందర్ లాల్ జీవిత గమనాన్ని మార్చి వేసింది. ఆయన దగ్గర ఉన్న ప్రగతిశీల సాహిత్యాన్ని బహుగుణ అధ్యయనం చేసేవారు. ఆ ప్రభావంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలోనే తన రాజకీయ గురువు శ్రీదేవ్ సుమన్‌ను రాజద్రోహం నేరాలపై గర్వాల్ సైనికులు నిర్బంధించారు. ఆ వార్తను ప్రచురణకు పంపిన సుందర్‌లాల్‌ను కారాగారంలో బంధించారు. జైల్లో ఉన్న శ్రీదేవ్ సుమన్ అక్కడి అధికారుల పైశాచిక హింసను నిరసిస్తూ ఆమరణ దీక్ష చేశారు. చివరికి ఆరోగ్యం క్షీణించి అసువులు బాశారు. అప్పటికే జబ్బు పడి ఉన్న సుందర్‌ లాల్‌ను వదిలిపెట్టారు. ఆయన అప్పుడు లాహోర్ వెళ్లి బీఏ చదివారు. చదువు పూర్తయ్యాక భారత్ చేరుకున్నారు. గురువు ప్రారంభించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలోనే అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం కూడా నడిపారు. సమభావం, కాంక్షిస్తూ అన్ని కులాల విద్యార్థులకు తేహ్రీలో ఒకే హాస్టల్ ఏర్పాటు చేశారు. దళితులకు గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లో ప్రవేశం కల్పించేందుకు ఉద్యమం నడిపారు. విజయం సాధించారు. ఈ సంఘటనలన్నీ ఆయన భవిష్యత్తు పోరాటాలకు సంకేతాలుగా నిలిచాయి. 1956లో వివాహానంతరం సుందర్ లాల్ బహుగుణ తన సతీమణి విమలతో కలిసి షిలియర అనే గ్రామం చేరారు. అక్కడ వారు ‘పర్వతీయ నవజీవన’ ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆ ఆశ్రమమే భవిష్యత్తులో వారు నిర్మించిన అనేక ఉద్యమాలకు కార్యక్షేత్రం అయింది. తాను కార్యదర్శిగా ఉన్న ప్రజామండలి సంస్థ జిల్లా కాంగ్రెస్ కమిటీగా రూపు దాల్చడంతో సుందర్‌లాల్ ఆ పదవుల నుంచి వైదొలిగారు. రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. తన జీవితాన్ని సంఘసేవకే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే ఆచార్య వినోబాబావే పిలుపు మేరకు సామాజిక సేవ దృష్టి సారించారు. సర్వోదయ ఉద్యమమే సర్వస్వంగా భావించారు.

హిమాలయ పర్వత ప్రాంతంలో పాదయాత్ర చేశారు. బాపూజీ ప్రవచించిన గ్రామ స్వరాజ్య సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రచారం చేశారు. పంచాయతీలను మేల్కొల్పారు. ఆ తరవాత 1965 నుంచి ఆరేళ్ల పాటు పర్వత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. నాటు సారా మత్తులో జోగుతున్న పల్లెల్ని చూసి ఆవేదన చెందారు. సారా మహమ్మారి సంసారాలను కాటువేస్తోన్న విషాదాన్ని స్వయంగా చూశారు. మహిళల మనోవేదనను అర్థం చేసుకున్నారు. తన సతీమణి విమలతో కలిసి సారా నిషేధ ఉద్యమానికి సమర శంఖం పూరించారు. నారీ లోకాన్ని కదిలించారు. ఆరేళ్ల పాటు ఆడపడుచులు చేసిన అవిశ్రాంత పోరాటానికి ప్రభుత్వం తలవంచింది. గర్వాల్ సహా ఐదు పర్వత ప్రాంత జిల్లాల్లో సారా నిషేధాన్ని విధించింది. ఈ విజయానికి సుందర్ లాల్ బహుగుణ సంబరపడిపోలేదు. అంతకంటే సంక్లిష్టంగా ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు ఆయన్ను కలవరపరిచాయి. ‘రాజకీయ కార్యచరణ చాలా ముఖ్యమైంది. రాజకీయ అవగాహన కోసం మనం ఏదైనా చేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. జనం కూడా తమంతటతాము తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం దొరుకుంది. అందుకే కదా నేను ఆ పనిలో నిమగ్నమయ్యాను’ అని ఓ సందర్భంలో బహుగుణ వ్యాఖ్యానించారు.

అలాగే  అక్కడ మోడు బారిన జీవితాలను ఆయన నిశితంగా పరిశీలించారు. అందుకు కారణాలును అన్వేషించారు. ఏటా ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్‌ల విస్తీర్ణం పెంచుతూ, పేదల బతుకులను పెకిలించడానికి చేస్తోన్న దుర్మార్గాలను, దుష్ట పన్నాగాలను గ్రహించారు. పర్వత ప్రాంత వాసులను సొంతగడ్డపై పరాయి బిడ్డలుగా మార్చిన అటవీ చట్టాల ఆటవికతను చూసి రగిలిపోయారు.  వాణిజ్య ప్రయోజనాల కోసం అడవులను అడ్డంగా తెగనరికే విధానాలపై పోరు ప్రారంభించారు. ఈ నేల, నీరు, చెట్టూ చేమపై ప్రతిఒక్కరికీ హక్కు ఉందని ఎలుగెత్తి ఘోషించారు. ప్రకృతి వనరులపై అందరికి అజమాయిషీ ఉండాలని ఉద్ఘాటించారు. ‘అడవులు నశించిపోతున్నాయి. నీరు తగ్గుతోంది. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వీటికి ప్రభుత్వం ఏం చేస్తోంది. ఏం చేయలేదు. స్వాతంత్ర్యం వచ్చాక జనం ఏం అనుకుంటున్నారంటే.. ప్రభుత్వమే అన్నీ చేసి పెడుతుందిలే అనుకున్నారు. అంటే ప్రజల్ని ఈ విషయంపై చైతన్యపర్చాల్సి ఉంది. ఇది మన సమస్య. మనమే పరిష్కరించుకోవాలని జనం అనుకోవాలి. జలమే కరవైపోతోంది. నీటితో పాటు ఆక్సిజన్ కూడా తరిగిపోతోంది. జీవించడానికి అవసరమైన గాలి కరవైపోతోంది’ అంటూ ప్రజల్ని మేల్కొల్పారు.

ఆలింగనం చేసుకోవడం ద్వారా చెట్లను పరిరక్షించే అపురూప ఉద్యమానికి గర్వాల్ ప్రాంతంలో సుందర్‌లాల్ శ్రీకారం చుట్టారు. ఆయన పిలుపుతో జనాలంతా వనాలవైపు దారితీశారు. గర్వాల్ చుట్టుపక్కల జిల్లాల్లో పదిలక్షల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం వేడుకలా జరిగింది. పుడమితల్లి పచ్చబొట్టు సింగారించుకున్నట్లు భాసించింది. ప్రతి గ్రామం పచ్చతోరణంలా కొత్త శోభను సంతరించుకుంది. పర్వతసానువులు ఆకుపచ్చ వడ్డానాల్లా హరిత కాంతులతో కళకళలాడాయి. చిట్టి చేతులు మొక్కల్ని కంటిపాపల్లా కాపాడే బాధ్యతను చేపట్టాయి. ప్రకృతికి, పల్లె మధ్య పచ్చటి అనుబంధం ఏర్పడింది. అయితే స్వార్థపరులైన కాంట్రాక్టర్లు పచ్చదనానికి చిచ్చుపెట్టే వికృతాలను మానలేదు. సాయుధ బలగాల అండతో స్వైర విహారం చేస్తూ, మహిళలను భయభ్రాంతులకు గురి చేయసాగారు. ఈ ఆకృత్యాలను, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సుందర్‌లాల్ తేహ్రీలో భాగీరథీ నదీ తీరాన 1974లో నిరాహార దీక్ష చేపట్టారు. ఫారెస్ట్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై, అటవీ చట్టాలపై ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి సుందర్‌లాల్ దీక్షతో భగ్గుమంది. వారంతా మద్దతుగా నిలిచి దండులా కదిలారు. దాంతో ప్రభుత్వం దిగొచ్చింది. వాణిజ్య ప్రయోజనాల కోసం చెట్ల నరికివేతను అంగీకరించేది లేదని ప్రకటించింది. చర్చిద్దాం రమ్మంటూ ఐదేళ్లు తాత్సారం చేసి, ప్రజలను వంచింది. ఈ సమయంలో సుందర్ లాల్ బహుగుణ ప్రభుత్వ కపట నాటకాన్ని ఎండగడుతూ చైత్యన యాత్రలను నిర్వహించారు. విధిలేక వేరు దారిలేక 1979 ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన ధర్మాగ్రహానికి దీక్షకు సర్కారు జడిసింది. కొండలపై 1,000మీ దాటాక ఉన్న వృక్షాలను నేలకూల్చడాన్ని నిషేధించింది. ఇది చిప్కో ఉద్యమానికి దక్కిన విజయం. ఆయన నాయకత్వ లక్షణాలకు వరించి వచ్చిన అఖండ విజయం. అయితే చిప్కో ఉద్యమాన్ని  ఉత్తరాంచల్‌లోని ఐదారు జిల్లాలకు పరిమితం చేయడం సరికాదని ఆయన అభిప్రాయం. చిప్కో ఉద్యమ సందేశాన్ని వినిపించేందుకు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఆయన 1981లో సుదీర్ఘ పాదయాత్ర తలపెట్టారు.

‘హిమాలయాలు మన కోసమే కాదు. ఉత్తరభారతానికి సరిపడా నదీ జలాలన్నీ ఇక్కడి నుంచే ప్రవహిస్తున్నాయి. అందుకే  హిమాలయాలను రక్షించుకోవాలి. నేను నా ఉద్యమానికి హిమాలయాల రక్షణోద్యమం అని పేరుపెట్టాను. ఈ హిమాలయాలను ఎందుకు రక్షించుకోవాలంటే ..వాటి అవసరం, ప్రభావం ఉత్తర భారతం అంతటా ఉంది. ఉత్తరాఖండ్ వరకే అని నేను హద్దులు గీయడం లేదు. అందుకే చిప్కో ఆందోళన విజయాన్ని దాని స్ఫూర్తిని కశ్మీర్ నుంచి కొహిమా వరకు తీసుకెళ్లాను. 4,870కి.మీ నడిచే వెళ్లాను. చివరకు 300వ రోజున నాగాలాండ్‌లో నా పాదయాత్రను ముగించాను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ యాత్రతో ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. పర్యావరణ పరిరక్షణ దిశగా దృష్టిసారించింది. ఈ యాత్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చిప్కో సందేశాన్ని ఊరూవాడల్లో వినిపించారు. 5ఎఫ్ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఫుడ్, ప్యూయల్‌, ఫెర్టిలైజర్ ,ఫైబర్, ఫ్యాడర్ అంశాల్లో స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు.

ఆయన ఇచ్చిన స్ఫూర్తితో హిమాలయ ప్రాంతాల్లోని గ్రామాల్లోని అనేక అడవులు మహిళా మండలుల అజమాయిషీలోకి వచ్చాయి. ఏడాదిలో ఆరునెలల పాటు కుటుంబ పోషణకు ఆలంబనగా నిలిచే వనమూలికలు, అటవీ ఉత్పత్తుల సేకరణకు స్వేచ్ఛ లభించింది. నరికివేతకు గురైన అడవుల్లో నాటిన మొక్కలతో పచ్చదనం వెల్లి వెరిసింది. పర్వతవాసుల మోమున ఆనందం తొంగి చూసింది. భారత దేశంలో పర్యావరణ ఉద్యమానికి సుందర్‌లాల్‌ బహుగుణ చేసిన సేవలను విదేశాలు సైతం గుర్తించాయి. విదేశీ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ఆహ్వానం మేరకు ఆయన 19దేశాల్లో పర్యటించారు. స్విట్జర్లాండ్‌ ఆయనను పర్యావరణ సలహాదారుగా నియమించాలనుకుంది. ఆయన ఖ్యాతికి ఇదొక మచ్చుతునక. సుందర్‌లాల్‌ చేసిన కృషిని గుర్తిస్తూ ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని