CM Revanth: ట్యాంక్‌ బండ్‌పై త్వరలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు: సీఎం రేవంత్‌

మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది.

Updated : 02 Mar 2024 21:34 IST

హైదరాబాద్‌: మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. శ్రీపాదరావు అజాత శత్రువని సీఎం రేవంత్‌ కొనియాడారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

‘‘తండ్రి వారసత్వాన్ని తీసుకుని శ్రీధర్‌బాబు స్వయంకృషితో ఎదిగారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొంది శాసనసభ వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలు, అనుభవం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాం. శ్రీపాదరావు లాంటి నేత తెలంగాణలో ఉండడం మన అదృష్టం. సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. కొందరిని మేనేజ్‌మెంట్‌ కోటా అంటుంటాను. మేనేజ్‌మెంట్‌ కోటా అనేది మొదటిసారి గెలవడానికే ఉపయోగపడుతుంది. సత్తా ఉంటేనే ఏం రంగంలోనైనా రాణించగలరు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. మన నాయకుల త్యాగం.. అక్కడికి వచ్చే వారికి తెలియాలి. కుమురం భీమ్‌, రాంజీగోండు, సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌, చాకలి ఐలమ్మ, జైపాల్‌రెడ్డి, శ్రీపాదరావు లాంటి ప్రముఖుల విగ్రహాలు నెలకొల్పేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’’ సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని