స్విట్జర్లాండ్‌లో ఏడాదికో అధ్యక్షుడు! 

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడతాయి. తమ అభ్యర్థిని అధ్యక్షుడిని చేయాలని సర్వశక్తుల ప్రయత్నిస్తాయి. గెలిచిన అభ్యర్థులు నాలుగు/ఐదు సంవత్సరాలు అధ్యక్షుడిగా దేశానికి సేవలు అందిస్తారు. 

Published : 16 Nov 2020 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికలొచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడతాయి. తమ అభ్యర్థిని అధ్యక్షుడిని చేయాలని సర్వశక్తులూ ఒడ్డుతాయి. గెలిచిన అభ్యర్థులు నాలుగు/ఐదు సంవత్సరాల పాటు దేశానికి సేవలందిస్తారు. స్విట్జర్లాండ్‌లో మాత్రం ఇలా జరగదు! అక్కడ ఏడాదికొకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పరిపాలిస్తుంటారు.  

స్విట్జర్లాండ్‌లోనూ అమెరికా తరహాలోనే నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ దాదాపు 15 పార్టీలున్నాయి. నాయకులంతా ఎన్నికల్లో నేషనల్‌ కౌన్సిల్‌ (200 స్థానాలు), కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌మ(46 స్థానాలు)లకు పోటీ చేస్తారు. ఈ రెండు సభలను కలిపి ఫెడరల్‌ అసెంబ్లీ (పార్లమెంట్‌)అంటారు. ఈ కౌన్సిల్‌ నుంచి ఎన్నుకోబడ్డ ఏడుగురు సభ్యులతో ‘స్విస్‌ కాన్ఫెడరేషన్‌’ ఏర్పడుతుంది. ఇదే స్విట్జర్లాండ్‌ను నాలుగేళ్లపాటు పరిపాలిస్తుంది. ఇందులో ఉండే ఏడుగురు కౌన్సిలర్లు వివిధ ప్రభుత్వ శాఖలకు బాధ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరు అధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

అయితే, ఈ బృందంలోని సభ్యులు ఏడాదికొక్కరు చొప్పున అధ్యక్ష పదవిని పంచుకోవడం విశేషం. ఒక ఏడాది ఉపాధ్యక్షుడిగా ఉన్నవాళ్లు.. తర్వాతి ఏడాది అధ్యక్షులవుతారు. అయితే ఈ కాన్ఫెడరేషన్‌లో అన్ని పార్టీల వారు ఉంటారు. 2019లో ఎన్నికలు జరగగా.. వివిధ పార్టీలకు చెందిన వియోలా అమ్‌హెర్డ్‌, యూలీ మౌరర్‌, గై పెర్మెలిన్‌, ఇగ్నాజియో కాసిస్‌, అలైన్‌ బార్సెట్‌, కరిన్‌ కెల్లర్‌-సుట్టర్‌, సిమొనెట్టా సొమరుగా ‘స్విస్‌ కాన్ఫెడరేషన్‌’కు ఎన్నికయ్యారు. గతేడాది మౌరర్‌ దేశాధ్యక్షుడిగా ఉండగా.. ఈ ఏడాది సిమొనెట్టా సొమరుగా అధ్యక్ష పీఠంపై కూర్చొన్నారు. స్విట్జర్లాండ్‌లో పరిపాలన ఎంతో పారదర్శకంగా ఉంటుంది. రాజ్యాంగంలో సవరణ చేయాలన్నా.. చట్టాల్లో సవరణ చేయాలన్నా దేశవ్యాప్తంగా రెఫరెండం నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని