విలేజ్‌ కుకింగ్ ఛానల్‌.. ‘కోటి’ కొట్టేసింది!

‘విలేజ్‌ కుకింగ్‌ ఛానెల్‌’.. ఇప్పటికే సుపరిచితమైన పేరు. గత మూడేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న ఈ యూట్యూబ్‌ ఛానెల్‌... తాజాగా కోటి మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. పల్లెదనం ఉట్టిపడేలా..

Published : 07 Jul 2021 09:30 IST

 ‘విలేజ్‌ కుకింగ్‌ ఛానల్‌’.. ఇప్పటికే సుపరిచితమైన పేరు. గత మూడేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న ఈ యూట్యూబ్‌ ఛానల్‌... తాజాగా కోటి మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. పల్లెదనం ఉట్టిపడేలా, పక్షుల కిలకిలల మధ్య వండుతూ.. రకరకాల వంటకాలను పరిచయం చేయడం ఈ ఛానల్‌ ప్రత్యేకత. ఈ ఛానల్‌ను నడిపిస్తోంది ఎవరో తెలుసా? కేవలం ఆరుగురు రైతులు. యూట్యూబ్‌ ద్వారా సంపాదిస్తూ...ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో ఓ కుగ్రామం చిన్నవీరమంగళం. ఆ గ్రామానికి చెందిన సుబ్రమణియన్‌ ఓ ప్రొడక్షన్‌హౌస్‌లో సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తూనే అక్కడ వ్యవసాయం చేసేవాడు. బ్లాగులు రాస్తుంటాడు. యూట్యూబ్‌కు ఆదరణ పెరిగాక ఓ వంటల ఛానల్‌ ప్రారంభించాలనుకున్నాడు. అదే గ్రామానికి చెందిన పెరియతంబి వంటల్లో సిద్ధహస్తుడు. రైతులైన అయ్యనార్‌, మురుగేశన్‌, ముత్తుమణికం, తమిళ్‌సెల్వన్‌లు సుబ్రమణియన్‌కు దగ్గరి బంధువులు. అతని కుకింగ్‌ ఛానల్‌ ఆలోచన నచ్చడంతో వీళ్లు కూడా అందులో భాగస్వాములయ్యారు.

రాహుల్‌ రాకతో మరింత పాపులర్‌

అప్పటి వరకూ అంతంతమాత్రంగా ఉన్న ఛానల్‌ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాకతో మరింత పాపులర్‌ అయ్యింది. 2019లో తమిళనాడు పర్యటనలో ఉన్న రాహుల్‌ అకస్మాత్తుగా వంటలు తయారు చేస్తున్న చోటికి వెళ్లి,  వారికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వారు చేస్తున్న బిర్యానీ గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి కొన్ని వంటకాల్లో గరిటె కూడా తిప్పారు. అనంతరం ప్రకృతి అందాల మధ్య నేలపై పరిచిన తాటాకుల చాపల్లో వారి మధ్యే కూర్చొని రాహుల్‌ బిర్యానీ ఆరగించారు. చాలా బాగుందని పెరియతంబి బృందాన్ని అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను తమిళనాడు కాంగ్రెస్‌శాఖ ట్విటర్‌లో పోస్టు చేయడంతో గంటల వ్యవధిలోనే లక్షల మంది వీక్షించారు.

సేవాభావం ఎక్కువే..

ఛానల్‌ ద్వారా సంపాదిస్తున్నప్పటికీ.. వీరంతా ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటారు. సాగుతో కుటుంబానికి సరిపడా ఆదాయం పొందుతున్నారు.అందువల్ల ఛానల్‌ ద్వారా వచ్చే డబ్బుతో సేవ చేయాలనుకున్నారు. ఆ ఊళ్లోనే ఓ స్వచ్ఛందసంస్థను ఏర్పాటు చేసి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రుల్నీ, మానసిక వికలాంగుల్నీ చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. చిన్నవీరమంగళం చుట్టుపక్కలున్న పలు గ్రామాల్లోని పొలాల్లోనూ, కాలువల పక్కనా వంట చేస్తుంటారు. వీడియో కోసం కొద్దిగా కాకుండా రెండు మూడొందల మందికి సరిపడా వండుతారు. ఏ గ్రామంలో వంట చేస్తే ఆ గ్రామస్థులకి సగం పెట్టి... మిగతాది వాళ్ల హోంలో ఉంటున్న వాళ్లకి వడ్డిస్తుంటారు. ఆత్మీయతను పంచుతూ ఆదాయమూ పొందుతున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని