Updated : 26 Feb 2021 04:29 IST

వాకిలే పాఠశాల.. రూపాయికే చదువు!


(ఫొటో: బెటర్‌ ఇండియా)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఏ ఉద్యోగి అయినా, పదవి విరమణ పొందగానే.. ఇంట్లోనే హాయిగా కూర్చొని సేద తీరుతూ మనవళ్లు.. మనవరాళ్లతో ఆడుకుంటూ కాలం గడపడాలని భావిస్తారు. చాలా మంది అలాగే చేస్తుంటారు. కానీ, 61 ఏళ్ల లోకేశ్‌ శరణ్‌ అలా అనుకోలేదు. టీచర్‌గా ఉద్యోగం చేసినప్పుడు ఎంతో మందిని భావిపౌరులుగా తీర్చి దిద్దిన ఆయన.. వృద్ధాప్యంలోనూ అదే పనిని కొనసాగిస్తున్నాడు. తన తండ్రి ఏర్పాటు చేసిన పాఠశాల మూతపడగా.. తన ఇంటి వాకిలినే పాఠశాలగా మార్చేశాడు. ఫీజులు కట్టి చదవుకోలేని పేద విద్యార్థుల నుంచి కేవలం ఒక్క రూపాయి ఫీజుగా తీసుకొని వారికి చదువు చెబుతున్నాడు. 

బిహార్‌లోని సమస్తిపూర్‌కి చెందిన లోకేశ్‌ శరణ్‌ టీచర్‌గా పనిచేసి పదవి విరమణ పొందాడు. ఆయన తండ్రి కూడా ఒకప్పుడు టీచర్‌గా పనిచేసి.. 1983లో సొంతంగా బాల సైనిక్‌ విద్యాలయం పేరుతో పాఠశాల ఏర్పాటు చేశారు. బీఎడ్‌ పూర్తి చేసిన శరణ్‌ తన తండ్రి పాఠశాలలోనే విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. ఈ క్రమంలో పేద విద్యార్థులు.. చదువుకు నోచుకోలేని చిన్నారులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సైతం నివేదిక ఇచ్చారు. ఆయన అధ్యయనాలు, కథనాలు మెచ్చి ఓ పత్రిక యాజమాన్యం అతడిని జర్నలిస్టుగా నియమించుకుంది. దీంతో చాలా కాలం సొంత బడిలో టీచర్‌గా.. ఒక పత్రిక విలేకరిగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి పాఠశాలలో విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు తీసుకోవడం వల్ల ఎక్కువ మౌలిక వసతులు కల్పించలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు వారి బిడ్డలకు అన్ని వసతులున్న మంచి పాఠశాలల్లో చేర్పించడానికి మొగ్గుచూపారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కొన్నేళ్ల కిందట పాఠశాల పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాఠశాల మూతపడ్డా.. తను పదవి విరమణ చేసినా పేద విద్యార్థులకు చదువు చెప్పాలన్న ఆశయం మాత్రం శరణ్‌లో అలాగే ఉంది. అందుకే, తన ఇంటి ముందు వాకిలిలో ఒక తరగతి గది నిర్మించి.. ఫీజులు కట్టి మంచి పాఠశాలల్లో చదువుకోలేని విద్యార్థులకు, పాఠశాలల్లో చదువుకుంటున్నా.. పాఠాలు అర్థం కానీ విద్యార్థులకు కేవలం రూపాయి ఫీజు తీసుకొని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. పాఠాలకే పరిమితం కాకుండా.. విద్యార్థుల చేతిరాత మెరుగుపర్చుకునే శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ తన ఇంట్లోనే కాదు, వృత్తిరీత్యా తన కుమారుడు ఎక్కడికి బదిలీ అయినా.. అతడిని చూసేందుకు వెళ్లిన ప్రతిసారి స్థానిక పాఠశాలల్లో కనీసం వారం పాటు పాఠాలు చెబుతాడట. అలాగే, సివిల్‌ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడినట్లే.. తన ఇంటి తరగతి గది కూడా మూతపడింది. అయినా విద్యార్థులకు చదువు చెప్పడం మానేయలేదు. రూపాయి ఫీజుతోనే గత కొంత కాలంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాడు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని